

మరణానంతరం నిర్వహించాల్సిన అంత్యక్రియలకు ముందుగానే ఏర్పాట్లు చేసుకునే సదుపాయాన్ని ఢిల్లీకి చెందిన ‘మోక్ష వాయేజ్’ అనే స్టార్టప్ సంస్థ అందుబాటులోకి తీసుకొచ్చింది. బతికుండగానే తమ అంతిమ సంస్కారాలకు సంబంధించిన ఏర్పాట్లు చేసుకునేలా పలు ప్యాకేజీలను ప్రకటించింది. మృతదేహాన్ని దహన సంస్కారాల ప్రదేశానికి తరలించడం, అంత్యక్రియల కోసం పురోహితులను ఏర్పాటు చేయడం, అవసరమైన సామగ్రిని సమకూర్చడం, సంప్రదాయ పద్ధతుల్లో అంతిమ సంస్కారాలను నిర్వహించడం వంటి సేవలను అందిస్తామని సంస్థ వెల్లడించింది. కుటుంబ సభ్యులకు ఆ సమయంలో ఏర్పడే ఇబ్బందులను తగ్గించి, అవసరమైన ఏర్పాట్లను క్రమబద్ధంగా నిర్వహించడమే తమ లక్ష్యమని పేర్కొంది.
ఈ వినూత్న ఆలోచనకు ఇండియా ఇంటర్నేషనల్ ట్రేడ్ ఫెయిర్‌లో మంచి స్పందన లభించినట్లు సంస్థ తన వెబ్‌సైట్‌లో వెల్లడించింది. అంత్యక్రియలతో పాటు అస్థికలను సేకరించడం, నిమజ్జనం చేయడం, శ్రాద్ధకర్మలు నిర్వహించడం వంటి సేవల్లోనూ సహకారం అందిస్తామని తెలిపింది. ఈ కార్యక్రమాల కోసం పడవలు, ఘాట్ల ఏర్పాట్లు కూడా చేస్తామని పేర్కొంది. అందించే సేవలను బట్టి ప్యాకేజీల ధరలు రూ.6 వేల నుంచి రూ.1.5 లక్షల వరకు ఉంటాయని సంస్థ వెల్లడించింది. ముందుగానే అంతిమ సంస్కారాలకు సంబంధించిన ఏర్పాట్లు చేసుకునే ఈ విధానం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది.














కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!