

ఉత్తరాఖండ్‌లో నిర్మిస్తున్న రిషికేశ్–కర్ణప్రయాగ్ రైల్వే ప్రాజెక్టులో మెఘా ఇంజినీరింగ్ అండ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్స్ లిమిటెడ్ (MEIL) మరో కీలక మైలురాయిని సాధించింది. రుద్రప్రయాగ్ జిల్లాలో 6.59 కిలోమీటర్ల పొడవైన టన్నెల్–14 ప్రధాన సొరంగం తవ్వకాలను విజయవంతంగా పూర్తి చేసింది. ఈ రైల్వే మార్గం అందుబాటులోకి వస్తే బద్రీనాథ్, కేదార్‌నాథ్, గంగోత్రి, యమునోత్రి వంటి చార్‌ధామ్ పుణ్యక్షేత్రాలకు వెళ్లే యాత్రికులకు మెరుగైన రవాణా సౌకర్యం లభించనుంది. పర్వత ప్రాంతాలకు రైలు ద్వారా చేరుకోవడం సులభతరం కావడంతో పాటు, యాత్రా సీజన్‌లో రహదారులపై రద్దీ, ప్రయాణ ఇబ్బందులు తగ్గనున్నాయి. పర్యాటకం, స్థానిక వ్యాపారాలు, ఉపాధి అవకాశాలకు కూడా ఈ ప్రాజెక్టు ఊతమివ్వనుంది. ఈ ఏడాది జూన్‌లో జోజిల టన్నెల్ బ్రేక్‌త్రూను పూర్తి చేసిన MEIL, తాజాగా మరో క్లిష్టమైన పర్వత ప్రాంత ప్రాజెక్టులో కీలక విజయం సాధించింది.
మొత్తం 6.59 కిలోమీటర్ల టన్నెల్–14లో సుమేర్‌పూర్ వైపు నుంచి 4.7 కిలోమీటర్లు, మారోరా వైపు నుంచి 1.79 కిలోమీటర్ల మేర తవ్వకాలు చేపట్టి, రెండు భాగాలను విజయవంతంగా అనుసంధానించారు. నివాస ప్రాంతాల కింద వదులైన మట్టిలో తవ్వకాలు, కొండ వాలుల స్థిరత్వం, భూమి కుంగుబాటు వంటి సవాళ్లను అధిగమించేందుకు ప్రీ-ఎక్స్‌కవేషన్, మల్టీ-డ్రిఫ్టింగ్, మైక్రోపైల్స్, రాక్ బోల్ట్స్, కన్సాలిడేషన్ గ్రౌటింగ్ వంటి ప్రత్యేక సాంకేతిక పద్ధతులను వినియోగించారు. కార్మికుల భద్రత, సమీప నివాస ప్రాంతాల రక్షణ కోసం నియంత్రిత బ్లాస్టింగ్, ప్రత్యేక వెంటిలేషన్ వ్యవస్థలను ఏర్పాటు చేశారు. ప్రతికూల వాతావరణం, క్లిష్టమైన భౌగోళిక పరిస్థితుల మధ్య ఇంజినీర్లు, జియాలజిస్టులు, సాంకేతిక నిపుణులు, కార్మికులు సమష్టిగా శ్రమించి ఈ ఘనత సాధించారు. ఈ రైల్వే ప్రాజెక్టు పూర్తయితే ఉత్తరాఖండ్‌లోని మారుమూల ప్రాంతాలకు మెరుగైన రవాణా అనుసంధానం ఏర్పడి, పర్యాటకం, వాణిజ్యం, స్థానిక ఆర్థికాభివృద్ధికి కొత్త అవకాశాలు లభించనున్నాయి.














కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!