

తెలుగు భక్తి సాహిత్యానికి అంతర్జాతీయ స్థాయిలో మరోసారి అరుదైన గుర్తింపు లభించింది. పదకవితా పితామహుడు తాళ్లపాక అన్నమాచార్యులు రచించిన ప్రసిద్ధ సంకీర్తన ‘బ్రహ్మమొక్కటే.. పరబ్రహ్మమొక్కటే’ స్విట్జర్లాండ్‌లోని అంతర్జాతీయ సంగీత వేదికపై మార్మోగింది. అక్కడ నిర్వహించిన సోల్స్‌బర్గ్ ఫెస్టివల్–2026లో ప్రముఖ గాయక బృందం ‘చాంటిక్లీర్’ ఈ సంకీర్తనను ఆలపించి ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేసింది. శతాబ్దాల క్రితం అన్నమయ్య రచించిన ఈ కీర్తనలోని ఆధ్యాత్మిక భావాన్ని, భక్తి సందేశాన్ని విదేశీ గాయకులు తమ స్వరాలతో అద్భుతంగా ఆవిష్కరించారు. భాష తెలియకపోయినా సంగీతం ద్వారా ఆ కీర్తనలోని భావాన్ని పలికించడం విశేషంగా నిలిచింది. తెలుగు నేలపై పుట్టిన అన్నమయ్య సంకీర్తన అంతర్జాతీయ వేదికపై వినిపించడం తెలుగు వారందరికీ గర్వకారణంగా మారింది. ప్రస్తుతం ఈ ప్రదర్శనకు సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది.
ఈ ప్రదర్శనలో మరో ప్రత్యేకత కూడా ఉంది. సాధారణంగా వినే సంప్రదాయ శైలికి భిన్నంగా చాంటిక్లీర్ బృందం ఈ సంకీర్తనను పాశ్చాత్య కాపెల్లా సంగీత పద్ధతిలో ఆలపించింది. ఎలాంటి సంగీత వాయిద్యాలను ఉపయోగించకుండా కేవలం గొంతులతోనే విభిన్న స్వరాలను పలికిస్తూ అద్భుతమైన సమన్వయంతో ప్రదర్శన ఇచ్చింది. ఈ ప్రదర్శన వెనుక భారతీయ మూలాలున్న గాయకుడు వినీల్ గరిసా మహల్ పాత్ర కూడా ఉంది. చాంటిక్లీర్ బృందంలో ప్రధాన గాయకుడిగా కొనసాగుతున్న ఆయన.. చిన్నతనంలో తల్లిదండ్రులతో కారులో ప్రయాణించే సమయంలో తరచూ వినిపించిన భారతీయ భక్తి గీతాలు తన సంగీత ప్రయాణంపై ఎంతో ప్రభావం చూపాయని వెల్లడించారు. ఇప్పుడు అదే భారతీయ సంగీత వారసత్వంలోని అన్నమయ్య సంకీర్తనను అంతర్జాతీయ వేదికపై ఆలపించడం విశేషంగా నిలిచింది. భాషలు, దేశాలు వేరైనా సంగీతానికి, భక్తికి ఎలాంటి హద్దులు ఉండవని ఈ ప్రదర్శన మరోసారి నిరూపించింది.




















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!