

తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే బతుకమ్మ ఉత్సవాలను రాష్ట్రవ్యాప్తంగా ఘనంగా నిర్వహించాలని పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అధికారులను ఆదేశించారు. నగరాలు, పట్టణాలు, గ్రామాలు అనే తేడా లేకుండా అన్ని ప్రాంతాల్లో పండుగ సంబరాలు అంబరాన్నంటేలా ఏర్పాట్లు చేయాలని సూచించారు. ముఖ్యంగా హైదరాబాద్‌లోని ట్యాంక్‌బండ్‌పై నిర్వహించే సద్దుల బతుకమ్మ వేడుకలను అంగరంగ వైభవంగా నిర్వహించేందుకు అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని స్పష్టం చేశారు. ఆదివారం బేగంపేటలోని టూరిజం ప్లాజాలో బతుకమ్మ ఉత్సవాల ఏర్పాట్లపై నిర్వహించిన సమీక్ష సమావేశంలో మంత్రి ఈ ఆదేశాలు జారీ చేశారు.
బతుకమ్మ పండుగ తెలంగాణ అస్తిత్వం, ప్రకృతితో ముడిపడిన జీవన విధానం, సంప్రదాయాలకు ప్రతీక అని పేర్కొన్న మంత్రి.. దాని విశిష్టతను ప్రజలకు మరింత చేరువ చేయాలని సూచించారు. ఉత్సవాల్లో ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొనేలా విస్తృత ఏర్పాట్లు చేయడంతో పాటు ప్రముఖులు, సెలబ్రిటీలను భాగస్వాములను చేసి పండుగ ప్రాముఖ్యతను విస్తృతంగా ప్రచారం చేయాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు. ప్రతిరోజూ నిర్వహించే కార్యక్రమాలు విజయవంతమయ్యేలా ముందస్తు ప్రణాళికతో పనిచేయాలని, అప్పగించిన బాధ్యతలను సమర్థంగా నిర్వర్తించాలని ఆదేశించారు. ఈ సమావేశంలో పర్యాటక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి వాణిప్రసాద్, తెలంగాణ పర్యాటక అభివృద్ధి సంస్థ ఎండీ క్రాంతి వల్లూరి, పర్యాటక శాఖ డైరెక్టర్ లక్ష్మణ్ రంజిత్ నాయక్, భాషా సాంస్కృతిక శాఖ డైరెక్టర్ నర్సింహారెడ్డి, వారసత్వ శాఖ డైరెక్టర్ డాక్టర్ అర్జునరావు తదితరులు పాల్గొన్నారు.




















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!