

రాష్ట్ర ఖజానాపై భారం పెంచుతున్న ఉచిత పథకాల అమలుపై తెలంగాణ హైకోర్టు తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. సంక్షేమ పథకాలను పరిమితికి మించి అమలు చేస్తే ఆర్థిక పరిస్థితులు ప్రమాదకరంగా మారే అవకాశం ఉందని జస్టిస్ నగేశ్ భీమపాక వ్యాఖ్యానించారు. 2024లో కంటోన్మెంట్ బోర్డుకు రూ.33.42 కోట్లు విడుదల చేయాలని ఇచ్చిన ఉత్తర్వులు అమలు కాలేదంటూ బోర్డు సభ్యుడు జె.రామకృష్ణ దాఖలు చేసిన కోర్టు ధిక్కరణ పిటిషన్‌పై శుక్రవారం విచారణ జరిగింది. ఆర్థికశాఖ ముఖ్య కార్యదర్శి సందీప్‌కుమార్ సుల్తానియా వ్యక్తిగతంగా హాజరై ఇప్పటికే రూ.24 కోట్లు చెల్లించామని, మిగిలిన మొత్తాన్ని ఆరు నెలల్లో విడతల వారీగా చెల్లిస్తామని తెలిపారు.
ఈ సందర్భంగా న్యాయమూర్తి రాష్ట్ర ఆదాయం, వ్యయం, జీతాలు, అప్పుల చెల్లింపులతో పాటు సంక్షేమ పథకాలకు జరుగుతున్న భారీ వ్యయంపై ప్రశ్నలు లేవనెత్తారు. అర్హత లేని వారికి కూడా పథకాల ప్రయోజనాలు అందుతున్నాయా? తెల్లకార్డుల సంఖ్యను తగ్గించగలరా? అంటూ ప్రశ్నించారు. అప్పులు తీర్చేందుకు ప్రభుత్వ భూములను విక్రయిస్తే భవిష్యత్ తరాల పరిస్థితి ఏమిటని ఆందోళన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో సుమారు 1.15 కోట్ల కుటుంబాలు ఉండగా, దాదాపు 1.03 కోట్ల కుటుంబాలు వివిధ ఉచిత పథకాల ప్రయోజనాలు పొందుతున్నాయని పేర్కొంటూ, ఈ విధానం దీర్ఘకాలంలో ఆచరణ సాధ్యం కాకపోవచ్చని వ్యాఖ్యానించారు. చెల్లింపులకు సంబంధించిన వివరాలతో అఫిడవిట్ దాఖలు చేయాలని ఆదేశిస్తూ విచారణను ఈ నెల 19కి వాయిదా వేశారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!