

గతంలో ఆత్మహత్య చేసుకున్న నర్సంపేట ఆర్టీసీ డిపో డ్రైవర్ శంకర్ గౌడ్ కుటుంబానికి ఇచ్చిన హామీని తెలంగాణ ప్రభుత్వం నెరవేర్చింది. ఆయన కుమారుడు హేమంత్ గౌడ్‌కు ఆర్టీసీలో రికార్డ్ ట్రెజరర్‌గా ఉద్యోగ నియామక పత్రాన్ని మంత్రి పొన్నం ప్రభాకర్, ఆర్టీసీ ఎండీ నాగిరెడ్డి అందజేశారు. ఈ కార్యక్రమంలో ఆర్టీసీ కార్మిక సంఘం నేతలు వెంకన్న, బాబురావుతో పాటు పలువురు అధికారులు, కార్మిక నాయకులు పాల్గొన్నారు. ముఖ్యమంత్రి సూచనల మేరకు శంకర్ గౌడ్ కుటుంబానికి ప్రభుత్వం, ఆర్టీసీ తరఫున పరిహారం అందించినట్లు మంత్రి తెలిపారు. తెలంగాణ ఆర్టీసీ ఉద్యోగులు ఒక రోజు వేతనంగా సుమారు కోటి రూపాయలను సేకరించి బాధిత కుటుంబానికి అందించినట్లు వెల్లడించారు.
ఈ సందర్భంగా మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ.. ప్రయాణికులకు సౌకర్యాలు కల్పించడం ఆర్టీసీ బాధ్యత అని, ఉద్యోగులను కాపాడుకోవడం సమాజ బాధ్యత అని పేర్కొన్నారు. ఆర్టీసీ సిబ్బంది పట్ల ఏవైనా ఫిర్యాదులు ఉంటే ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లాలని, భౌతిక దాడులకు పాల్పడితే కఠిన చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం నేపథ్యంలో రద్దీకి అనుగుణంగా అదనపు బస్సులు ఏర్పాటు చేస్తున్నామని, కొత్త బస్సుల కొనుగోలు, బస్టాండ్ల ఆధునీకరణకు చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. గ్రామాలకు బస్సు సౌకర్యం కల్పించాలంటే స్థానిక అధికారులను సంప్రదించాలని, రూట్ వెరిఫికేషన్ అనంతరం సాధ్యాసాధ్యాలను బట్టి నిర్ణయం తీసుకుంటామని వివరించారు.


కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!