

తెలంగాణలో క్రీడల అభివృద్ధికి, క్రీడాకారులను ప్రోత్సహించడానికి రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక ప్రాధాన్యం ఇస్తోందని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క తెలిపారు. శనివారం హైదరాబాద్‌లోని గోల్కొండ కోట సమీపంలోని గోల్ఫ్ కోర్స్‌లో నిర్వహించిన ఇండియన్ గోల్ఫ్ ప్రీమియర్ లీగ్ (ఐజీపీఎల్) టోర్నమెంట్ ముగింపు కార్యక్రమానికి ఆయన రోడ్లు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డితో కలిసి హాజరయ్యారు. హైదరాబాద్ గోల్ఫ్ అసోసియేషన్, ఎన్‌డీటీవీ, ఏఎం గ్రీన్, ఐజీపీఎల్ సంయుక్తంగా ఈ పోటీలను నిర్వహించాయి. అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన క్రీడా మౌలిక సదుపాయాలు, మెరుగైన శిక్షణ, యువ క్రీడాకారులకు ప్రోత్సాహకాలు అందించేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందని భట్టి చెప్పారు. హైదరాబాద్‌లో ప్రపంచస్థాయి స్పోర్ట్స్ స్టేడియం నిర్మించనున్నట్లు ముఖ్యమంత్రి ప్రకటించిన విషయాన్ని గుర్తుచేశారు.
దక్షిణ కొరియా వంటి దేశాల్లో క్రీడా రంగంలో సాధిస్తున్న విజయాలను అధ్యయనం చేసి, అక్కడి శిక్షణా విధానాలు, సౌకర్యాలు, ప్రోత్సాహకాలను తెలంగాణలోనూ అమలు చేసే దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తోందని భట్టి తెలిపారు. ఇటీవల ముఖ్యమంత్రి క్రీడలు, సంబంధిత కార్యకలాపాల పురోగతిపై సమీక్ష నిర్వహించి, పతకాలు సాధిస్తున్న విశ్వవిద్యాలయాల పనితీరును పరిశీలించాలని అధికారులకు సూచించినట్లు చెప్పారు. ఈ క్రమంలో ముఖ్యమంత్రి దక్షిణ కొరియాలోని ఓ విశ్వవిద్యాలయాన్ని సందర్శించి, వైస్ ఛాన్సలర్, క్రీడా అధికారులతో చర్చలు జరిపారని వెల్లడించారు. తెలంగాణ విద్యార్థులకు అంతర్జాతీయ స్థాయి క్రీడా శిక్షణ అందించేందుకు ఆ విశ్వవిద్యాలయంతో అవగాహన ఒప్పందం కుదుర్చుకునే అంశాన్ని పరిశీలిస్తున్నట్లు తెలిపారు. క్రీడా సదుపాయాల అభివృద్ధితో పాటు పర్యాటక రంగానికీ ప్రోత్సాహం అందిస్తామని స్పష్టం చేశారు.
గోల్ఫ్‌కు ప్రపంచవ్యాప్తంగా ఆదరణ పెరుగుతోందని, గోల్కొండ కోట సమీపంలోని హైదరాబాద్ గోల్ఫ్ కోర్స్‌కు ప్రత్యేక గుర్తింపు ఉందని భట్టి విక్రమార్క పేర్కొన్నారు. ఈ వేదిక నగరానికి మరింత ప్రాచుర్యం తీసుకురావడంతో పాటు క్రీడలు, పర్యాటక రంగాల అభివృద్ధికి దోహదపడుతుందని అన్నారు. రాష్ట్రంలోని గోల్ఫ్ కోర్స్‌తో పాటు ఇతర క్రీడా వేదికలకు కూడా భవిష్యత్తులో సహకారం అందిస్తామని హామీ ఇచ్చారు. ఐజీపీఎల్ టోర్నమెంట్‌లో పాల్గొన్న క్రీడాకారులకు, విజేతలకు అభినందనలు తెలిపి, వారు భవిష్యత్తులో మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షించారు. అనంతరం విజేతలకు ట్రోఫీలను అందజేశారు. క్రీడాకారులను ప్రోత్సహించే కార్యక్రమాలు మరిన్ని నిర్వహించాలని పిలుపునిచ్చారు.


కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!