

తెలంగాణలో పెట్టుబడులకు పూర్తి భద్రత కల్పిస్తామని, ప్రభుత్వ విధానాల్లో స్థిరత్వం కొనసాగుతుందని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి యూకే వ్యాపార ప్రతినిధి బృందానికి హామీ ఇచ్చారు. రాష్ట్రంలో తయారీరంగాన్ని మరింత విస్తరించడంపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందని తెలిపారు. బుధవారం ఎంసీఆర్హెచ్ఆర్డీలో సౌత్యార్క్షైర్, యార్క్ అండ్ నార్త్‌యార్క్‌షైర్, వెస్ట్యార్క్షైర్ ప్రాంతాల మేయర్లు ఆలివర్ కోపార్డ్, డేవిడ్ స్కేత్, ట్రేసీ బ్రాబిన్ నేతృత్వంలోని ప్రతినిధి బృందం సీఎంతో సమావేశమైంది. గతేడాది డిసెంబరులో ప్రారంభించిన తెలంగాణ రైజింగ్ 2047 దీర్ఘకాలిక అభివృద్ధి ప్రణాళిక రూపకల్పనలో బ్రిటన్ మాజీ ప్రధాని టోనీ బ్లెయిర్ విజ్ఞాన భాగస్వామిగా కీలక పాత్ర పోషించారని సీఎం గుర్తుచేశారు. ఐటీ, ఫార్మాస్యూటికల్స్, లైఫ్‌సైన్సెస్, బయోటెక్నాలజీ, ఏరోస్పేస్, రక్షణ, ఎలక్ట్రానిక్స్ తయారీ రంగాల్లో తెలంగాణ ప్రగతిని వివరించారు. 30 వేల ఎకరాల్లో అంతర్జాతీయ ప్రమాణాలతో అభివృద్ధి చేయనున్న భారత ఫ్యూచర్ సిటీ మాస్టర్ ప్లాన్‌ను త్వరలో విడుదల చేస్తామని తెలిపారు. మూసీ పునరుజ్జీవం ద్వారా హైదరాబాద్‌లో రివర్‌ఫ్రంట్, నైట్ ఎకానమీని అభివృద్ధి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు చెప్పారు. డిసెంబరు 7 నుంచి 9 వరకు భారత ఫ్యూచర్ సిటీలో జరగనున్న ఇన్వెస్ట్ తెలంగాణ గ్లోబల్ సమిట్–2026కు యూకే బృందాన్ని ఆహ్వానించారు. ఈ సందర్భంగా యూకే–ఇండియా బిజినెస్ కౌన్సిల్ రూపొందించిన ‘యూకే–ఇండియా సెటా అండ్ రీజినల్ సినర్జీస్’ నివేదికను ఆవిష్కరించారు.
తెలంగాణతో కలిసి అడ్వాన్స్డ్ మాన్యుఫ్యాక్చరింగ్, వైద్య ఆరోగ్యం, డిజిటల్ టెక్నాలజీ, రక్షణ, ఏరోస్పేస్, టెక్నికల్ టెక్స్టైల్స్, నైపుణ్యాభివృద్ధి, పరిశోధన రంగాల్లో పనిచేసేందుకు యూకే ప్రతినిధి బృందం ఆసక్తి వ్యక్తం చేసింది. ఈ రంగాల్లో భాగస్వామ్య ఒప్పందాలపై చర్చించేందుకు మరోసారి తెలంగాణలో పర్యటించే ఆలోచనలో ఉన్నట్లు తెలిపింది. తెలంగాణలోని డిజిటల్ ఆర్థిక వ్యవస్థ, నైపుణ్యం కలిగిన మానవ వనరులు, వ్యాపార విస్తరణ అవకాశాలు ఆకట్టుకున్నాయని సౌత్యార్క్షైర్ మేయర్ ఆలివర్ కోపార్డ్ పేర్కొన్నారు. యార్క్‌షైర్, తెలంగాణ మధ్య ఉన్న సారూప్యతలు రెండు ప్రాంతాల మధ్య మరింత సహకారానికి దోహదపడతాయని వెస్ట్యార్క్షైర్ మేయర్ ట్రేసీ బ్రాబిన్ అభిప్రాయపడ్డారు. అంతకుముందు ఐటీ శాఖ మంత్రి శ్రీధర్‌బాబు ప్రతినిధి బృందానికి స్వాగతం పలికి, జీనోమ్ వ్యాలీతో పాటు రాష్ట్రంలోని ఆవిష్కరణల వ్యవస్థను సందర్శించాలని ఆహ్వానించారు. ఈ సమావేశంలో యూకే–ఇండియా బిజినెస్ కౌన్సిల్ సీఈవో కిశోర్ జయరామన్, బ్రిటిష్ డిప్యూటీ హైకమిషన్ ప్రతినిధులు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు, ముఖ్యమంత్రి సలహాదారు కె. రామకృష్ణారావు తదితరులు పాల్గొన్నారు.























కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!