

విజయవాడలో నిర్వహించిన జాతీయ సరస్ మేళా-2026లో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పాల్గొన్నారు. దసరా శరన్నవరాత్రుల సందర్భంగా విజయవాడలో ఈ మేళాను నిర్వహించడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచిందని ఆయన పేర్కొన్నారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్మును నారీశక్తికి, నవభారత శక్తికి ప్రతిరూపంగా అభివర్ణించారు. ఢిల్లీ వెలుపల తొలిసారిగా విజయవాడలో మహిళల జాతీయ సరస్ మేళాను నిర్వహించడం మహిళా శక్తిని చాటుతుందని తెలిపారు. గ్రామీణ మహిళల ఆదాయాన్ని పెంచడం, మహిళా పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించడం, గ్రామీణ ఉత్పత్తులకు గుర్తింపు తీసుకురావడమే ఈ మేళా ప్రధాన ఉద్దేశమని చెప్పారు. ఆంధ్రప్రదేశ్లో 11 లక్షల స్వయం సహాయక సంఘాలు రూ.69 వేల కోట్ల టర్నోవర్తో ముందంజలో ఉన్నాయని, ఏడాది కాలంలో లక్ష మంది సంఘాల మహిళలను వ్యాపారవేత్తలుగా తీర్చిదిద్దామని వెల్లడించారు. భవిష్యత్తులో మరింత మంది మహిళలను పారిశ్రామికవేత్తలుగా అభివృద్ధి చేయడమే లక్ష్యమన్నారు.
డ్వాక్రా సంఘాలు తయారు చేస్తున్న ఉత్పత్తులకు ‘స్వయం ఏపీ’ బ్రాండ్ను తీసుకొచ్చామని చంద్రబాబు తెలిపారు. ఈ ఉత్పత్తులను ఈ-కామర్స్, ఆన్లైన్ షాపింగ్ వేదికల ద్వారా అందుబాటులోకి తీసుకువస్తామని చెప్పారు. పొదుపు సంఘాలు పొదుపు చేసే స్థాయి నుంచి ఆదాయం ఆర్జించే వ్యాపార సంస్థలుగా ఎదగాలని, భవిష్యత్తులో అంతర్జాతీయ బ్రాండ్లుగా గుర్తింపు పొందాలని ఆకాంక్షించారు. మహిళల సంక్షేమం, సాధికారత కోసం తల్లికి వందనం, స్త్రీశక్తి వంటి పథకాలను అమలు చేస్తున్నామని పేర్కొన్నారు. స్త్రీశక్తి ఉచిత బస్సు ప్రయాణ పథకం ద్వారా మహిళలు 100 కోట్ల ప్రయాణాలు పూర్తి చేశారని తెలిపారు. ప్రతి మహిళకు ‘వెల్ఫేర్ టు వెల్త్’ అందించడమే ప్రభుత్వ లక్ష్యమని, స్వయం సహాయక సంఘాల సహకారంతో స్వర్ణాంధ్ర-2047 లక్ష్యాన్ని సాధించేందుకు కృషి చేస్తున్నామని చెప్పారు. ప్రతి సంఘం ఆర్థిక శక్తిగా, ప్రతి మహిళ పారిశ్రామికవేత్తగా, ప్రతి గ్రామం ఉపాధి కేంద్రంగా ఎదగాలని ఆకాంక్షించారు.



కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!