

బార్ కౌన్సిల్ కమిటీలను నామినేషన్ పద్ధతిలో నియమించడం చెల్లదని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. చట్టబద్ధమైన ఎన్నికల ప్రక్రియ ద్వారానే కమిటీలను ఏర్పాటు చేయాలని తేల్చిచెప్పింది. తెలంగాణ బార్ కౌన్సిల్ కమిటీల నియామకంపై బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా (బీసీఐ) విధించిన మధ్యంతర స్టేను సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్‌పై శుక్రవారం విచారణ సందర్భంగా ధర్మాసనం ఈ వ్యాఖ్యలు చేసింది. తెలంగాణ బార్ కౌన్సిల్ ఏర్పాటు చేసిన ఎగ్జిక్యూటివ్, ఎన్‌రోల్‌మెంట్, ప్రివిలేజెస్, లైబ్రరీ, ఫైనాన్స్, డిసిప్లినరీ కమిటీల నియామకంలో అడ్వకేట్స్ యాక్ట్–1961 నిబంధనలు పాటించలేదని వెంకట్ యాదవ్, పొన్నం అశోక్‌గౌడ్, రోహిణి స్మిత, సునీల్‌గౌడ్, ఎంఏకే ముఖీద్ బీసీఐకి ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదు ఆధారంగా అక్టోబర్ 23న బీసీఐ కమిటీల నియామకంపై మధ్యంతర స్టే విధించింది. ఈ నిర్ణయాన్ని తెలంగాణ బార్ కౌన్సిల్ అక్టోబర్ 30న సుప్రీంకోర్టులో సవాల్ చేసింది. సీజేఐ జస్టిస్ సూర్యకాంత్ నేతృత్వంలోని జస్టిస్ జోయ్‌మాల్యా బాగ్చీ, జస్టిస్ వి.మోహన్‌లతో కూడిన త్రిసభ్య ధర్మాసనం శుక్రవారం ఈ పిటిషన్‌ను విచారించింది.
తెలంగాణ బార్ కౌన్సిల్ తరఫున సీనియర్ న్యాయవాది దామా శేషాద్రినాయుడు, అడ్వకేట్ ఆన్ రికార్డ్ పి.మోహిత్‌రావు వాదనలు వినిపించారు. కమిటీలను ఏకపక్షంగా నియమించారనే ఆరోపణల్లో వాస్తవం లేదని, బార్ కౌన్సిల్‌కు ఎన్నికైన 23 మంది సభ్యుల్లో మెజారిటీ అయిన 18 మంది కమిటీల నియామక బాధ్యతను చైర్మన్‌కు అప్పగించారని తెలిపారు. ఎన్నికల ప్రక్రియలో పోటీ లేని సందర్భాల్లో కమిటీల సభ్యులను నామినేట్ చేసే అధికారం చైర్మన్‌కు ఉంటుందని వాదించారు. అయితే ఈ వాదనతో ధర్మాసనం ఏకీభవించలేదు. చట్టబద్ధమైన ఎన్నికల ప్రక్రియను ఎలా పక్కన పెడతారని ప్రశ్నించింది. కమిటీలు ఏకగ్రీవంగా ఎన్నికయ్యే అవకాశం ఉన్నప్పటికీ, ముందుగా ఎన్నికల ప్రక్రియను ప్రారంభించాల్సిందేనని స్పష్టం చేసింది. ఎన్నికల ప్రక్రియ చేపట్టకుండానే ఏకగ్రీవంగా నిర్ణయించడం వల్ల గందరగోళం ఏర్పడే అవకాశం ఉందని అభిప్రాయపడింది. ఎన్నికలు నిర్వహించేందుకు తమకు అభ్యంతరం లేదని తెలంగాణ బార్ కౌన్సిల్ తరఫు న్యాయవాదులు చెప్పడంతో, చట్టబద్ధంగా ఎన్నికలు పూర్తి చేసి, పూర్తి నివేదికను బీసీఐకి సమర్పించాలని ఆదేశిస్తూ పిటిషన్‌ను పరిష్కరించింది. అప్పటివరకు బీసీఐ విధించిన మధ్యంతర స్టే కొనసాగుతుందని స్పష్టం చేసింది.




















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!