

బాణసంచా దుకాణాల ఏర్పాటుకు అనుమతులు కోరుతూ వచ్చిన వారి నుంచి డబ్బులు డిమాండ్ చేస్తున్నారన్న ఫిర్యాదుల నేపథ్యంలో ఎల్బీనగర్ అగ్నిమాపక కేంద్రంపై అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) అధికారులు శుక్రవారం దాడులు నిర్వహించారు. ఉప్పల్ భగాయత్‌లోని ఈ అగ్నిమాపక కేంద్రంలో నిర్వహించిన సోదాల్లో ఇన్‌చార్జి సీఐ శీనయ్య, స్టేషన్ ఇన్‌చార్జి పి. శ్రీధర్‌తో పాటు మరికొందరు సిబ్బందికి సంబంధించిన రూ.30 వేల అనధికార నగదును గుర్తించినట్లు అధికారులు తెలిపారు. అలాగే 80 ఆన్‌లైన్ లావాదేవీలను గుర్తించినట్లు రంగారెడ్డి జిల్లా రేంజ్ డీఎస్పీ ఆనంద్ కుమార్ వెల్లడించారు.
సిబ్బంది మొబైల్ ఫోన్లను పరిశీలించగా, బాణసంచా దుకాణాల నిర్వాహకుల నుంచి ఫోన్‌పే, గూగుల్ పే, పేటీఎం ద్వారా డబ్బులు స్వీకరించినట్లు గుర్తించామని డీఎస్పీ తెలిపారు. దుకాణాల స్థాయిని బట్టి రూ.500 నుంచి రూ.5 వేల వరకు చెల్లింపులు జరిగినట్లు వెల్లడించారు. ఈ వ్యవహారంపై పూర్తిస్థాయి విచారణ చేపట్టిన అనంతరం, ఉన్నతాధికారుల అనుమతితో అవినీతికి పాల్పడినట్లు తేలిన వారిపై చర్యలు తీసుకుంటామని ఆనంద్ కుమార్ పేర్కొన్నారు.




















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!