

నకిలీ ట్రేడింగ్ యాప్ ద్వారా సైబర్ మోసగాళ్లు హైదరాబాద్‌కు చెందిన ఓ ఐటీ ఉద్యోగిని రూ.55 లక్షలకు పైగా మోసం చేశారు. బాచుపల్లికి చెందిన బాధితుడిని సెప్టెంబరులో ‘అనన్య దాస్’ అనే మహిళ వాట్సాప్ గ్రూపులో చేర్చింది. అప్‌స్టాక్స్ ఇన్‌స్టిట్యూషనల్ ట్రేడింగ్ ద్వారా అధిక లాభాలు పొందవచ్చని నమ్మించింది. ప్రొఫెసర్ రవికుమార్ సూచనల మేరకు బ్లాక్ ట్రేడింగ్, ఐపీవోలలో పెట్టుబడులు పెట్టాలని ప్రోత్సహించింది. ఇందుకోసం upsktvpro.com అనే నకిలీ ప్లాట్‌ఫామ్‌లో ఖాతా తెరిపించి, విడతల వారీగా డబ్బులు జమ చేయించింది. బాధితుడు మొత్తం రూ.55,58,910 పెట్టుబడి పెట్టగా, ప్రారంభంలో కేవలం రూ.58,700 మాత్రమే తిరిగి చెల్లించారు.
అయితే, ఆ నకిలీ యాప్‌లో రూ.97 లక్షల లాభం వచ్చినట్లు చూపించి బాధితుడిని మరిన్ని పెట్టుబడులు పెట్టేలా ప్రోత్సహించారు. ఏసీఎంఈ, హెచ్‌డీ ఫైర్ ప్రొటెక్ట్ ఐపీవోల పేరుతోనూ భారీ మొత్తంలో డబ్బులు పెట్టించారు. చివరకు బాధితుడు రూ.10 లక్షలు విత్‌డ్రా చేసుకునేందుకు ప్రయత్నించగా, ముందుగా 15 శాతం కమీషన్, 20 శాతం పన్ను చెల్లించాలని మోసగాళ్లు డిమాండ్ చేశారు. దీంతో అనుమానం వచ్చిన బాధితుడు తాను మోసపోయినట్లు గుర్తించి సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించాడు. బాధితుడి ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.




















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!