

ప్రముఖ ఈ-కామర్స్ సంస్థ ఫ్లిప్‌కార్ట్ గ్రూప్‌లో కీలక నాయకత్వ మార్పు చోటుచేసుకుంది. 11 ఏళ్లకు పైగా సంస్థలో సేవలందించిన గ్రూప్ సీఈఓ కల్యాణ్ కృష్ణమూర్తి తన పదవికి రాజీనామా చేశారు. ఈ విషయాన్ని కంపెనీ బుధవారం అధికారికంగా ప్రకటించింది. అయితే, ఆయన నిష్క్రమణకు గల కారణాలను వెల్లడించలేదు. ప్రస్తుతం గ్రూప్ చీఫ్ ప్రొడక్ట్ ఆఫీసర్‌గా ఉన్న బాలాజీ త్యాగరాజన్ తాత్కాలిక సీఈఓగా బాధ్యతలు చేపట్టనున్నారు.
ఫ్లిప్‌కార్ట్‌ను సచిన్ బన్సల్, బిన్నీ బన్సల్ స్థాపించారు. వారు సంస్థ బాధ్యతల నుంచి తప్పుకున్న తర్వాత 2017లో కల్యాణ్ కృష్ణమూర్తి సీఈఓగా నియమితులయ్యారు. 2018లో ఫ్లిప్‌కార్ట్ గ్రూప్ సీఈఓగా బాధ్యతలు చేపట్టారు. అమెజాన్, మీషో వంటి సంస్థల నుంచి తీవ్ర పోటీ ఎదురైనప్పటికీ ఫ్లిప్‌కార్ట్‌ను ముందుకు తీసుకెళ్లడంలో కీలక పాత్ర పోషించారు. జెన్‌జీ వినియోగదారులను ఆకర్షించడం, ఫుడ్ డెలివరీ రంగంలోకి ప్రవేశించడం, బ్లింకిట్, జెప్టోలకు పోటీగా ఫ్లిప్‌కార్ట్ మినిట్స్‌ను ప్రారంభించడం వంటి వ్యూహాలపై దృష్టి పెట్టారు. ఆయన రాజీనామాకు కచ్చితమైన కారణాలు తెలియకపోయినా, సంస్థలో అంతర్గత సమస్యలు, ఐపీఓ జాప్యం, మాతృసంస్థ వాల్‌మార్ట్‌తో విభేదాలు కారణమై ఉండొచ్చని సమాచారం. ఫ్లిప్‌కార్ట్‌ను స్టాక్ మార్కెట్‌లో లిస్ట్ చేసే అంశంపై వాల్‌మార్ట్ ఇంకా తుది నిర్ణయం తీసుకోకపోవడంతో ఐపీఓ ప్రక్రియ ఆలస్యమవుతోంది. దీంతో తమ షేర్లను నగదుగా మార్చుకునే అవకాశం లేకపోవడంపై ఉద్యోగుల్లో అసంతృప్తి నెలకొన్నట్లు తెలుస్తోంది. గత ఏడాది కాలంలో పలువురు వైస్ ప్రెసిడెంట్లు, సీనియర్ ఎగ్జిక్యూటివ్‌లు సంస్థను వీడిన నేపథ్యంలో కల్యాణ్ కృష్ణమూర్తి రాజీనామా ప్రాధాన్యం సంతరించుకుంది.














కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!