

ఎంబీబీఎస్ మొదటి సంవత్సరం సప్లిమెంటరీ పరీక్షల కేంద్రాల విషయంలో కాళోజీ నారాయణరావు ఆరోగ్య విజ్ఞాన విశ్వవిద్యాలయం తీసుకున్న నిర్ణయంపై విద్యార్థులు, తల్లిదండ్రులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. డిసెంబర్ 1 నుంచి ఎంబీబీఎస్ ఫస్టియర్ విద్యార్థులకు సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహించాలని వర్సిటీ అధికారులు నిర్ణయించారు. అయితే, విద్యార్థులు చదువుతున్న కళాశాలలకు దూరంగా 40 నుంచి 50 కిలోమీటర్ల పరిధిలో పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేయడంపై అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. దూర ప్రాంతాలకు వెళ్లి పరీక్షలు రాయాల్సి రావడం వల్ల విద్యార్థులు ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. పరీక్షా కేంద్రాల కేటాయింపులో విద్యార్థుల సౌకర్యాన్ని పరిగణనలోకి తీసుకోలేదని వారు విమర్శిస్తున్నారు.
విద్యార్థులు ఎంబీబీఎస్ చదువుతున్న కళాశాలల్లోనే పరీక్షలు రాసేలా అధికారులు చర్యలు తీసుకోవాలని తెలంగాణ బీసీ విద్యార్థి సంఘం అధ్యక్షుడు రాజేశ్వర్ యాదవ్ డిమాండ్ చేశారు. విద్యార్థులకు ఇబ్బందులు కలిగించే నిర్ణయాన్ని వెంటనే ఉపసంహరించుకోవాలని కోరారు. ఈ విషయంలో వర్సిటీ అధికారులు స్పందించకపోతే ఆందోళన చేపడతామని హెచ్చరించారు. వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహ జోక్యం చేసుకుని సమస్యను పరిష్కరించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. విద్యార్థులు తమ కళాశాలల్లోనే పరీక్షలు రాసేలా తగిన ఏర్పాట్లు చేయాలని కోరారు.




















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!