

తెలంగాణ రాష్ట్ర పారిశ్రామికాభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం మరింత సహకారం అందించాలని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు కోరారు. సోమవారం న్యూఢిల్లీలో కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్‌తో సమావేశమైన ఆయన, ‘తెలంగాణ రైజింగ్ విజన్ 2047’ లక్ష్యాల సాధనకు అవసరమైన పలు కీలక ప్రాజెక్టులకు కేంద్ర మద్దతు కోరుతూ వినతిపత్రం సమర్పించారు. భవిష్యత్తు అవసరాలకు అనుగుణంగా తెలంగాణలో బలమైన పారిశ్రామిక ఎకోసిస్టమ్‌ను అభివృద్ధి చేస్తున్నామని, వికసిత్ భారత్ @2047 లక్ష్య సాధనలో రాష్ట్రం కీలక పాత్ర పోషిస్తుందని పేర్కొన్నారు.
భవ్య పథకం ఫేజ్-1లో రాష్ట్రానికి ప్రాధాన్యం కల్పించడం, ఏరో-డిఫెన్స్ కారిడార్ మంజూరు చేయడం, హైదరాబాద్‌లో నేషనల్ డిజైన్ సెంటర్ ఏర్పాటు చేయడం, రెండు మెగా లెదర్ పార్కులను కేటాయించడం వంటి అంశాలను కేంద్ర మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. అలాగే మెదక్ జిల్లా మనోహరాబాద్‌లో మల్టీ మోడల్ లాజిస్టిక్స్ పార్కుకు అనుమతులు, కోహెడలో ఇర్రేడియేషన్ ఫెసిలిటీకి నిధులు, జహీరాబాద్ ఇండస్ట్రియల్ స్మార్ట్ సిటీలో లాజిస్టిక్స్ హబ్ అభివృద్ధికి సహకారం కోరారు. రామగుండం ఎరువుల కర్మాగారంలో ఉత్పత్తి అయ్యే యూరియాను తెలంగాణకు కేటాయించేందుకు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!