

తెలంగాణలో పెట్టుబడులను ప్రోత్సహించడంతో పాటు రాష్ట్రాన్ని పారిశ్రామికంగా మరింత అభివృద్ధి చేసే లక్ష్యంతో డిసెంబర్ 7 నుంచి 9 వరకు ‘తెలంగాణ గ్లోబల్ రైజింగ్ సమ్మిట్ 2026’ నిర్వహించనున్నట్లు ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు తెలిపారు. ఈ సమ్మిట్లో పాల్గొనాలని పారిశ్రామికవేత్తలు, పెట్టుబడిదారులు, ఆవిష్కర్తలకు ఆయన పిలుపునిచ్చారు. సమాఖ్య ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఆధ్వర్యంలో నిర్వహించిన ‘సమాఖ్య గ్లోబల్ బిజినెస్ మీట్–2026’కు మంత్రి గౌరవ అతిథిగా హాజరై ప్రసంగించారు. తెలంగాణలో పెట్టుబడులు పెట్టి ‘రైజింగ్ తెలంగాణ’ లక్ష్య సాధనలో భాగస్వాములు కావాలని కోరారు.
‘తెలంగాణ రైజింగ్–2047’ విజన్లో భాగంగా రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను 2047 నాటికి 3 ట్రిలియన్ డాలర్లకు చేర్చడమే లక్ష్యమని శ్రీధర్ బాబు పేర్కొన్నారు. రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల్లో సమాన అభివృద్ధి, నూతన పరిశ్రమలకు ప్రోత్సాహం, వ్యాపారాలకు అనుకూల వాతావరణం కల్పించడంపై ప్రభుత్వం దృష్టి సారించిందన్నారు. హైదరాబాద్లో ఐటీ, సాంకేతిక రంగాలను మరింత విస్తరించడంతో పాటు ఇతర ప్రాంతాల్లో తయారీ, వ్యవసాయ ఆధారిత పరిశ్రమలను ప్రోత్సహిస్తున్నట్లు తెలిపారు. ఐటీ, ఫార్మా, లైఫ్ సైన్సెస్తో పాటు ఏఐ, ఏరోస్పేస్, రక్షణ, అధునాతన తయారీ రంగాల్లో పెట్టుబడులు పెట్టేందుకు గ్లోబల్ రైజింగ్ సమ్మిట్ను సద్వినియోగం చేసుకోవాలని పారిశ్రామికవేత్తలకు విజ్ఞప్తి చేశారు.














కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!