

శ్రీ సత్యసాయి బాబా 101వ జయంతి వేడుకలు నవంబర్ 23న పుట్టపర్తిలో నిర్వహించనున్నారు. ఈ వేడుకల్లో పాల్గొనేందుకు ఆంధ్రప్రదేశ్, తెలంగాణతో పాటు తమిళనాడు, కర్ణాటక, పశ్చిమ బెంగాల్, ఒడిశా రాష్ట్రాల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు తరలిరానున్నారు. శతజయంతి ఉత్సవాలను ఘనంగా నిర్వహించేందుకు ప్రశాంతి నిలయం ప్రతినిధులు ఏర్పాట్లు పూర్తి చేస్తున్నారు. సత్యసాయి సేవా సంస్థలు ఆధ్యాత్మిక సమావేశాలు, సేవా కార్యక్రమాలను నిర్వహించనున్నాయి. భక్తుల ప్రయాణ సౌకర్యార్థం రైల్వే అధికారులు సంత్రాగచ్చి, శ్రీకాకుళం రోడ్, యలహంక, విజయవాడ మధ్య ప్రత్యేక రైళ్లను ప్రకటించారు.
సంత్రాగచ్చి నుంచి నవంబర్ 17, 24 తేదీల్లో మధ్యాహ్నం 12:40 గంటలకు బయలుదేరే 08031 నంబర్ ప్రత్యేక రైలు మరుసటి రోజు రాత్రి 9:30 గంటలకు శ్రీ సత్యసాయి ప్రశాంతి నిలయం చేరుకుంటుంది. తిరుగు ప్రయాణంలో 08032 నంబర్ రైలు నవంబర్ 18, 25 తేదీల్లో రాత్రి 11 గంటలకు బయలుదేరి మూడో రోజు ఉదయం 8 గంటలకు సంత్రాగచ్చి చేరుతుంది. శ్రీకాకుళం రోడ్ నుంచి నవంబర్ 20న సాయంత్రం 4 గంటలకు బయలుదేరే 08555 నంబర్ రైలు మరుసటి రోజు మధ్యాహ్నం 3 గంటలకు యలహంక చేరుకుంటుంది. తిరుగు ప్రయాణంలో 08556 నంబర్ రైలు నవంబర్ 24న సాయంత్రం 5 గంటలకు యలహంక నుంచి బయలుదేరి మరుసటి రోజు సాయంత్రం 5:15 గంటలకు శ్రీకాకుళం రోడ్ చేరుతుంది. యలహంక నుంచి నవంబర్ 21న సాయంత్రం 5 గంటలకు బయలుదేరే 07246 నంబర్ రైలు మరుసటి రోజు ఉదయం 7:45 గంటలకు విజయవాడ చేరుకుంటుంది. తిరుగు ప్రయాణంలో 07245 నంబర్ రైలు నవంబర్ 23న రాత్రి 11:50 గంటలకు విజయవాడ నుంచి బయలుదేరి మరుసటి రోజు మధ్యాహ్నం 3 గంటలకు యలహంక చేరుతుంది. ఈ రైళ్లు మార్గాన్ని బట్టి ఖరగ్పూర్, బాలేశ్వర్, భువనేశ్వర్, విశాఖపట్నం, దువ్వాడ, రాజమండ్రి, విజయవాడ, గుంటూరు, నంద్యాల, డోన్, గుంతకల్, అనంతపురం, ధర్మవరం తదితర స్టేషన్లలో ఆగుతాయి. ప్రయాణికులు ప్రయాణానికి ముందు పూర్తి సమయాలు, హాల్ట్ స్టేషన్ల వివరాలను పరిశీలించాలని రైల్వే అధికారులు సూచించారు.


కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!