

కార్తీక మాసం సందర్భంగా శైవ క్షేత్రాలను దర్శించుకోవాలనుకునే భక్తుల కోసం తెలంగాణ ఆర్టీసీ ప్రత్యేక ఏర్పాట్లు చేస్తోంది. ఉమ్మడి వరంగల్ జిల్లాలోని వివిధ డిపోల నుంచి ప్రముఖ పుణ్యక్షేత్రాలకు ప్రత్యేక బస్సులు నడపాలని నిర్ణయించింది. తెలంగాణతో పాటు ఆంధ్రప్రదేశ్‌లోని పంచారామ క్షేత్రాలు, తమిళనాడులోని అరుణాచలం, కేరళలోని శబరిమలకు ప్రత్యేక సర్వీసులు అందుబాటులోకి తీసుకురానుంది. కనీసం 30 మంది భక్తులు ఒక బృందంగా ఏర్పడి ఏదైనా పుణ్యక్షేత్రానికి వెళ్లాలనుకుంటే ప్రత్యేక బస్సును కూడా సమకూర్చనుంది. భక్తుల అభ్యర్థన మేరకు ఈ ఏర్పాట్లు చేసినట్లు వరంగల్-1 డిపో మేనేజర్ పి. అర్పిత తెలిపారు. భక్తులు ఆర్టీసీ సేవలను వినియోగించుకుని సురక్షితంగా పుణ్యక్షేత్రాలను దర్శించుకోవాలని సూచించారు.
అరుణాచలం గిరి ప్రదక్షిణకు వెళ్లే భక్తుల కోసం నవంబర్ 23న మధ్యాహ్నం హనుమకొండ బస్టాండ్ నుంచి ప్రత్యేక బస్సు బయలుదేరనుంది. ఈ యాత్రలో కాణిపాకం, వేలూరు గోల్డెన్ టెంపుల్, అరుణాచలం గిరి ప్రదక్షిణ అనంతరం అలంపూర్‌లోని జోగులాంబ ఆలయాన్ని దర్శించుకునేలా ప్రణాళిక రూపొందించారు. నవంబర్ 27న తిరిగి హనుమకొండ చేరుకుంటారు. ఈ యాత్రకు పెద్దలకు రూ.5,000, పిల్లలకు రూ.3,500 టికెట్ ధర నిర్ణయించారు. శబరిమలకు వెళ్లే అయ్యప్ప భక్తులు 36 మంది కలిసి బుక్ చేసుకుంటే ప్రత్యేక బస్సు ఏర్పాటు చేస్తారు. ఇందులో ఒక గురుస్వామి, ఇద్దరు మణికంఠ స్వాములు, ఒక వంటమనిషి, సామగ్రి నిర్వహణ కోసం మరొకరికి ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పిస్తారు. మరోవైపు పంచారామ క్షేత్రాలైన అమరావతి, భీమవరం, పాలకొల్లు, సామర్లకోట, ద్రాక్షారామాలను ఒకేరోజు దర్శించుకునేలా ప్రతి ఆదివారం హనుమకొండ నుంచి ప్రత్యేక బస్సులు నడపనున్నారు. ఈ యాత్రకు పెద్దలకు రూ.2,300, పిల్లలకు రూ.1,500 టికెట్ ధర నిర్ణయించారు.


కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!