

కర్ణాటకలో కరువు పరిస్థితులు తీవ్రతరం అవుతున్న నేపథ్యంలో ముఖ్యమంత్రి డీకే శివకుమార్ ప్రధాని నరేంద్ర మోదీకి లేఖ రాశారు. రాష్ట్రంలోని 177 తాలూకాలను ఇప్పటికే కరువు ప్రభావిత ప్రాంతాలుగా ప్రకటించినట్లు ఆయన తెలిపారు. వర్షాభావ పరిస్థితుల కారణంగా పంటలు, నీటి లభ్యత, పశుసంపద, గ్రామీణ ఆర్థిక వ్యవస్థపై ప్రభావం పడుతోందని పేర్కొన్నారు. పరిస్థితి మరింత తీవ్రతరం కాకముందే కరువు సహాయక చర్యలు చేపట్టేందుకు కేంద్రం నుంచి తక్షణ ఆర్థిక సహాయం అందించాలని కోరారు.
కరువు సహాయానికి రాష్ట్రం సమర్పించిన మెమొరాండం మొత్తంలో 50 శాతాన్ని అంచనా, ఆమోద ప్రక్రియ పూర్తయ్యేలోపు మధ్యంతర సాయంగా విడుదల చేయాలని శివకుమార్ విజ్ఞప్తి చేశారు. అలాగే రాష్ట్ర విపత్తు స్పందన నిధి (ఎస్‌డీఆర్‌ఎఫ్) రెండో విడతలో కేంద్ర వాటాను ముందుగానే విడుదల చేయాలని కోరారు. ఈ నిధులతో రైతులకు పంట నష్ట పరిహారం, తాగునీటి సరఫరా, పశుసంపద రక్షణ, ఇతర అత్యవసర కరువు సహాయక చర్యలు చేపట్టవచ్చని ఆయన పేర్కొన్నారు.


కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!