

రేవంత్ రెడ్డి దేశ ఆర్థికాభివృద్ధికి ప్రధాన కేంద్రాలుగా ఉన్న హైదరాబాద్, దిల్లీ, ముంబయి, కోల్కతా, చెన్నై, బెంగళూరు నగరాల సమగ్ర అభివృద్ధి కోసం ప్రధానమంత్రి కార్యాలయం ఆధ్వర్యంలో ‘ఎం-6 టాస్క్ఫోర్స్’ ఏర్పాటు చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. నీతి ఆయోగ్ 11వ గవర్నింగ్ కౌన్సిల్ సమావేశంలో మాట్లాడుతూ ప్రతి మెట్రో నగరానికి రూ.లక్ష కోట్ల చొప్పున మొత్తం రూ.6 లక్షల కోట్ల పెట్టుబడులు మౌలిక వసతుల అభివృద్ధికి కేటాయించాలని ప్రతిపాదించారు. వికసిత్ భారత్-2047 లక్ష్య సాధనకు నాణ్యమైన విద్య, ఆరోగ్యం, నైపుణ్యాభివృద్ధి, ప్రపంచ స్థాయి మౌలిక వసతులు కీలకమని పేర్కొన్నారు.
సమావేశం అనంతరం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కు వినతిపత్రం అందజేసిన సీఎం, తెలంగాణకు సంబంధించిన ఏడు కీలక ప్రాజెక్టులకు తక్షణ ఆమోదం ఇవ్వాలని కోరారు. హైదరాబాద్ మెట్రో రెండో దశ, రీజినల్ రింగ్ రోడ్, హైదరాబాద్-అమరావతి-మచిలీపట్నం పోర్ట్ ఎక్స్ప్రెస్వే, వరంగల్ విమానాశ్రయం, హైదరాబాద్లో ఐఐఎం ఏర్పాటు, మూసీ పునరుజ్జీవ ప్రాజెక్టు, పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి కేంద్ర సహకారం కోరారు. అలాగే యంగ్ ఇండియా స్కూల్స్, యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీ ద్వారా విద్యా, నైపుణ్య రంగాల్లో సంస్కరణలు చేపడుతున్నట్లు వివరించారు. 2034 నాటికి తెలంగాణను ఒక ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా, 2047 నాటికి 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక శక్తిగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ లక్ష్యమని స్పష్టం చేశారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!