

ఉస్మానియా విశ్వవిద్యాలయంలో విద్యార్థులు ఎదుర్కొంటున్న హాస్టల్ వసతి సమస్యలను వెంటనే పరిష్కరించాలని, సంప్రదాయబద్ధంగా హుస్సేన్ సాగర్‌లో జరిగే గణేశ్ నిమజ్జనాలకు పూర్తిస్థాయి అనుమతులు ఇవ్వాలని బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్. రాంచందర్‌రావు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. నవరాత్రి ఉత్సవాల సందర్భంగా ఓయూ క్యాంపస్‌లోని పలు హాస్టళ్లను సందర్శించిన ఆయన.. విద్యార్థులతో మాట్లాడి సమస్యలను తెలుసుకున్నట్లు తెలిపారు. పాత హాస్టల్ భవనాలకు మరమ్మతులు చేపట్టడంతో పాటు శిథిలావస్థకు చేరిన భవనాల స్థానంలో ఆధునిక వసతి గృహాలను నిర్మించాలని కోరారు.
‘ఈ’ హాస్టల్ విద్యార్థులను ప్రత్యామ్నాయ ఏర్పాట్లు లేకుండా ‘సి’ హాస్టల్‌కు తరలించడంపై రాంచందర్‌రావు అభ్యంతరం వ్యక్తం చేశారు. ఓయూ అభివృద్ధికి రూ.1,000 కోట్లు ఇస్తామని ముఖ్యమంత్రి ప్రకటించారని, ఆ నిధులను వెంటనే విడుదల చేయాలని కోరారు. మరోవైపు, హైదరాబాద్‌లో దశాబ్దాలుగా హుస్సేన్ సాగర్ వేదికగా గణేశ్ నిమజ్జనాలు నిర్వహిస్తున్నందున ఈసారి కూడా ప్రధాన సాగర్‌లోనే నిమజ్జనాలకు అనుమతించాలని డిమాండ్ చేశారు. భారీ క్రేన్లు, పారిశుధ్య ఏర్పాట్లతో నిమజ్జన ప్రక్రియను నిర్వహించడంతో పాటు అవసరమైన భద్రత, మౌలిక వసతులు కల్పించాలని ప్రభుత్వాన్ని కోరారు.


కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!