

ప్రముఖ పాకశాస్త్ర నిపుణుడు, చెఫ్ కె. దామోదరన్ (దాము) ఆదివారం కన్నుమూశారు. 72 ఏళ్ల ఆయన ఆరోగ్య సమస్యలతో చెన్నైలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. భారతీయ వంటకాలకు విశేష గుర్తింపు తీసుకొచ్చిన దామోదరన్.. తన ప్రతిభతో దేశవ్యాప్తంగా పేరుపొందారు. మద్రాసు విశ్వవిద్యాలయం నుంచి హోటల్ మేనేజ్‌మెంట్‌లో పీహెచ్‌డీ చేసిన ఆయన, వంటకళలో విశేష నైపుణ్యాన్ని ప్రదర్శించారు. భారతీయ వంటల సంప్రదాయాన్ని ప్రాచుర్యంలోకి తీసుకురావడంలో కీలక పాత్ర పోషించారు. ఆయన మరణవార్తతో పాకశాస్త్ర రంగంలో విషాదం నెలకొంది. పలువురు ప్రముఖులు దామోదరన్ మృతిపట్ల సంతాపం వ్యక్తం చేస్తూ, వంటకళకు ఆయన అందించిన సేవలను గుర్తుచేసుకున్నారు.
వంటకళలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న దామోదరన్ 2010లో అరుదైన ఘనత సాధించారు. 24 గంటల 30 నిమిషాల 12 సెకన్ల వ్యవధిలో 617 రకాల వంటకాలను సిద్ధం చేసి గిన్నిస్ వరల్డ్ రికార్డును నెలకొల్పారు. ఈ ఘనతతో ఆయన అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు పొందారు. పాకశాస్త్ర రంగంలో ఆయన చేసిన విశేష కృషికి గుర్తింపుగా కేంద్ర ప్రభుత్వం 2025లో పద్మశ్రీ పురస్కారంతో సత్కరించింది. వంటకళను కేవలం వృత్తిగా కాకుండా సృజనాత్మకత, అంకితభావం కలగలిసిన కళగా చాటిచెప్పిన దాము సేవలు చిరస్మరణీయంగా నిలిచిపోనున్నాయి.



కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!