

నగరాల పరిపాలనను మరింత సమర్థవంతంగా నిర్వహించేందుకు రాష్ట్రాలు ‘మేయర్ ఇన్ కౌన్సిల్’ విధానాన్ని ప్రవేశపెట్టాలని కేంద్ర క్యాబినెట్ మాజీ కార్యదర్శి, నీతి ఆయోగ్ సభ్యుడు రాజీవ్ గాబా సూచించారు. పార్లమెంటరీ ప్రజాస్వామ్యంలో మంత్రివర్గ విధానం ఉన్నట్లుగానే నగర పాలనలోనూ ఈ విధానం ఉపయోగపడుతుందని అభిప్రాయపడ్డారు. భారత జనాభా 2060 నాటికి సుమారు 165 కోట్లకు చేరి స్థిరపడే అవకాశం ఉందని, 2050 నాటికి దాదాపు 50 శాతం మంది పట్టణ ప్రాంతాల్లో నివసిస్తారని పేర్కొన్నారు. ప్రస్తుతం సుమారు 50 కోట్లుగా ఉన్న పట్టణ జనాభా 85 కోట్లకు పెరగవచ్చని అంచనా వేశారు. ఇంతటి జనాభాకు అవసరమైన మౌలిక సదుపాయాలు, గృహాలు, ఇతర ప్రాథమిక అవసరాలను తీర్చేందుకు నగర ప్రణాళిక, పరిపాలన, ఆర్థిక వనరుల సమీకరణలో సమూల మార్పులు అవసరమని తెలిపారు.
నగరాలకు మరింత అధికారాలు కల్పించాలంటే ప్రజలకు సేవలు అందించే విధానాన్ని మెరుగుపరచడంతో పాటు అభివృద్ధిలో ప్రజల భాగస్వామ్యాన్ని పెంచాలని రాజీవ్ గాబా సూచించారు. మేయర్‌ను ఐదేళ్ల కాలానికి నేరుగా ఎన్నుకోవాలని, 74వ రాజ్యాంగ సవరణకు అనుగుణంగా పట్టణ స్థానిక సంస్థలకు 18 విధులను రాష్ట్ర ప్రభుత్వాలు బదిలీ చేయాలని పేర్కొన్నారు. మాస్టర్ ప్లానింగ్, నీటి సరఫరా, అగ్నిమాపక సేవలు, ట్రాఫిక్ నిర్వహణ వంటి బాధ్యతలను నగర పాలక సంస్థలకు అప్పగించాలని అన్నారు. రాష్ట్ర రాజధానుల నుంచి అన్ని నగరాల అవసరాలను సమర్థవంతంగా తీర్చడం సాధ్యం కాదని, స్థానిక సమస్యలపై తక్షణమే స్పందించే అధికారం, సంస్థాగత సామర్థ్యం నగర ప్రభుత్వాలకు ఉండాలని స్పష్టం చేశారు. భవన నిర్మాణ నిబంధనల్లో సంస్కరణలు చేపట్టడం, కఠినమైన ఫ్లోర్ ఏరియా రేషియో (FAR) పరిమితులను తొలగించడం, భూమి లభ్యతను పెంచేందుకు భూ సమీకరణ విధానాన్ని ప్రోత్సహించడం అవసరమని వివరించారు.




కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!