

రిపబ్లిక్ ఆఫ్ కొరియా సంస్థల నుంచి పెట్టుబడులను ఆకర్షించడం, యువతకు ఉపాధి అవకాశాలు కల్పించడం, సాంకేతిక పరిజ్ఞాన బదిలీని ప్రోత్సహించడంపై తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందని ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క తెలిపారు. హైదరాబాద్‌లోని మాదాపూర్ శిల్పకళా వేదికలో ఆదివారం నిర్వహించిన ‘కొరియన్ కల్చరల్ డే ఇన్ హైదరాబాద్-2026’ కార్యక్రమంలో ఆయన పాల్గొని ప్రసంగించారు. దక్షిణ కొరియా ఆర్థిక ప్రగతి నుంచి తెలంగాణ నేర్చుకోవాల్సిన అంశాలు ఎన్నో ఉన్నాయని పేర్కొన్నారు. పరిశ్రమలు, విశ్వవిద్యాలయాలు, పరిశోధనా సంస్థలు, స్టార్టప్‌ల మధ్య సహకారాన్ని పెంచాల్సిన అవసరం ఉందన్నారు. ఎలక్ట్రానిక్స్, ఎలక్ట్రిక్ వాహనాలు, లైఫ్ సైన్సెస్, పునరుత్పాదక ఇంధనం వంటి రంగాల్లో దక్షిణ కొరియా సంస్థలతో కలిసి పనిచేసేందుకు విస్తృత అవకాశాలు ఉన్నాయని వివరించారు.
పర్యాటక రంగంలో వచ్చే ఐదేళ్లలో రూ.15 వేల కోట్ల పెట్టుబడులను ఆకర్షించడంతోపాటు మూడు లక్షల మందికి ఉపాధి అవకాశాలు కల్పించాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుందని భట్టి విక్రమార్క తెలిపారు. తెలంగాణ, దక్షిణ కొరియాకు చెందిన యువత విద్య, పరిశోధన, ఉద్యోగ రంగాల్లో అందుబాటులో ఉన్న అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. రిపబ్లిక్ ఆఫ్ కొరియా రాయబారి లీ సుంగ్-హో మాట్లాడుతూ హైదరాబాద్ అందమైన నగరమని ప్రశంసించారు. దక్షిణ కొరియా, తెలంగాణ మధ్య స్నేహ సంబంధాలను మరింత బలోపేతం చేయడంలో ఈ సాంస్కృతిక దినోత్సవం కీలక పాత్ర పోషిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. కొరియా కాన్సుల్ జనరల్ హైదరాబాద్ చుక్కపల్లి సురేశ్ తదితరులు పాల్గొన్న ఈ కార్యక్రమంలో కొరియా సంప్రదాయ నృత్యాలు, కె-పాప్ ప్రదర్శనలతోపాటు తెలంగాణ సంప్రదాయ నృత్యాలు ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి.



కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!