

వికసిత్ భారత్ లక్ష్యానికి అనుగుణంగా దేశ గగనతల రక్షణ సామర్థ్యాలను మరింత బలోపేతం చేయడంపై దృష్టి సారించినట్లు భారత వాయుసేన (ఐఏఎఫ్) అధిపతి ఎయిర్ చీఫ్ మార్షల్ ఏపీ సింగ్ తెలిపారు. 2047 నాటికి ప్రపంచంలోని అత్యంత సమర్థవంతమైన, సృజనాత్మక, అత్యాధునిక ఏరోస్పేస్ బలగాల్లో ఒకటిగా ఎదగడమే తమ లక్ష్యమని వెల్లడించారు. అభివృద్ధి చెందిన దేశంగా మారాలంటే భారత్ సురక్షితంగా ఉండటంతో పాటు ఎలాంటి విపత్కర పరిస్థితులనైనా ఎదుర్కొనే సామర్థ్యాన్ని కలిగి ఉండాలని పేర్కొన్నారు. ఆపరేషన్ సిందూర్ ద్వారా ఎంత దూరంలోని లక్ష్యాన్నైనా ఛేదించగలమని నిరూపితమైందని చెబుతూ, పాకిస్థాన్‌కు పరోక్ష హెచ్చరిక జారీ చేశారు. ఇండో-పసిఫిక్ ప్రాంతంలోని పరిణామాలను నిశితంగా గమనిస్తున్నట్లు పీటీఐ వార్తా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన వివరించారు.
త్రివిధ దళాల మధ్య సమన్వయాన్ని పెంచి, అవసరమైనప్పుడు వేగంగా స్పందించేలా కేంద్రీకృత నియంత్రణ వ్యవస్థను ఏర్పాటు చేయడమే థియేటరైజేషన్ ప్రణాళిక ప్రధాన ఉద్దేశమని ఏపీ సింగ్ తెలిపారు. ఈ ప్రక్రియలో భాగంగా పోరాట సామర్థ్యాలను భౌగోళికంగా విభజించబోమని, సైనిక సంసిద్ధతకు ఎలాంటి విఘాతం కలగకుండా దశలవారీగా ప్రణాళికను అమలు చేస్తామని స్పష్టం చేశారు. దేశ ప్రయోజనాలను పరిరక్షించేందుకు సుదూర లక్ష్యాలను ఛేదించే సామర్థ్యాలను ఐఏఎఫ్ మరింత అభివృద్ధి చేస్తోందన్నారు. అండమాన్ నికోబార్ దీవుల్లో భారత బలగాల మోహరింపు తూర్పు హిందూ మహాసముద్ర ప్రాంతంలో వ్యూహాత్మకంగా కీలకమని పేర్కొన్నారు. దేశ సార్వభౌమత్వం, వ్యూహాత్మక స్వతంత్రతను కాపాడుకుంటూనే ఇండో-పసిఫిక్ ప్రాంతంలో స్వేచ్ఛాయుత వాతావరణాన్ని పరిరక్షించేందుకు భారత్ కృషి చేస్తోందని తెలిపారు.




కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!