

చిత్తూరు జిల్లా పడిపుట్లబైలు పరిసరాల్లో ఏనుగుల సంచారంపై రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, అటవీ–పర్యావరణ శాఖల మంత్రి పవన్ కల్యాణ్ అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఏనుగుల గుంపును సురక్షితంగా తిరిగి అటవీ ప్రాంతంలోకి మళ్లించేందుకు అవసరమైన చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. ముసలమడుగు శిబిరం నుంచి కుంకీ ఏనుగులను తీసుకువచ్చి ఆపరేషన్ చేపట్టాలని సూచించారు. హనుమాన్ బృందాలు, పోలీసులు, రెవెన్యూ, విద్యుత్ శాఖల సమన్వయంతో ఏనుగుల కదలికలపై నిరంతర నిఘా కొనసాగించాలని స్పష్టం చేశారు.
గత 15 రోజులుగా 11 ఏనుగులతో కూడిన గుంపుతో పాటు, గుంపు నుంచి విడిపోయిన మరో రెండు ఏనుగులు పడిపుట్లబైలు పంచాయతీ పరిసరాల్లో సంచరిస్తున్నాయి. పుండ్లవల్లపల్లి, నడింపల్లి, కొండకిందపల్లి గ్రామాల్లో పంటలకు నష్టం జరిగినట్లు రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం ఒక గుంపు మంగళంపేట బీట్ వైపు, మరో రెండు ఏనుగులు చిత్తూరు వైపు కదులుతున్నట్లు అధికారులు తెలిపారు. పాకాల, పులిచెర్ల, చంద్రగిరి మండలాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, ఏనుగుల కదలికలకు అనుగుణంగా గ్రామస్థులను ముందుగానే హెచ్చరించాలని పవన్ కల్యాణ్ సూచించారు. పంట నష్టపోయిన రైతులకు తక్షణ పరిహారం అందేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.


కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!