

ప్రధాని నరేంద్ర మోదీ చిన్ననాటి సహపాఠి అస్గర్ అలీ వోరాకు మహారాష్ట్రలోని మీరా-భాయందర్ భూ వివాదంలో ఊరట లభించింది. 81 ఏళ్ల వోరా సెప్టెంబర్ 8న ప్రధాని మోదీని కలిసి తన భూమి వివాదంపై జోక్యం చేసుకోవాలని కోరారు. గుజరాత్‌లోని వడ్నగర్‌లో మోదీతో కలిసి చదువుకున్న వోరా.. భాయందర్ ఈస్ట్‌లోని నవ్‌ఘర్ ప్రాంతంలో సుమారు 2,810 చదరపు మీటర్ల భూమిని 1989లో రిజిస్టర్డ్ ఒప్పందం ద్వారా కొనుగోలు చేసినట్లు తెలిపారు. 2011లో తనకు తెలియకుండా నకిలీ పత్రాలు సృష్టించి భూమిని రెండు భాగాలుగా విభజించారని ఆయన ఆరోపించారు. ఒక భాగాన్ని స్వయం బిల్డర్స్‌కు, మరో భాగాన్ని బీజేపీ ఎమ్మెల్యే నరేంద్ర మెహతాతో సంబంధం ఉన్న సెవెన్ ఎలెవెన్ కన్‌స్ట్రక్షన్స్‌కు చూపించారని వోరా పేర్కొన్నారు.
వోరా ప్రధాని మోదీని కలిసిన అనంతరం మహారాష్ట్ర ప్రభుత్వ అధికారులు ఈ వ్యవహారంపై దృష్టి సారించారు. ముఖ్యమంత్రి ప్రిన్సిపల్ సెక్రటరీ శ్రీకర్ పరదేశీ అధ్యక్షతన మంత్రాలయంలో జరిగిన సమావేశంలో వోరాతో పాటు నరేంద్ర మెహతా, మీరా-భాయందర్ మున్సిపల్ కమిషనర్ రాధా వినోద్ శర్మ, టౌన్ ప్లానర్ పురుషోత్తం షిండే పాల్గొన్నారు. ఈ సమావేశం అనంతరం నరేంద్ర మెహతా టౌన్ ప్లానింగ్ శాఖకు లేఖ సమర్పించి వివాదాస్పద స్థలంపై తన ఆధిపత్యాన్ని వదులుకుంటున్నట్లు, ఆ స్థలానికి మంజూరైన నిర్మాణ అనుమతిని కూడా తిరిగి ఇస్తున్నట్లు తెలిపారు. అలాగే వోరాపై గతంలో ఇచ్చిన పోలీసు ఫిర్యాదును ఉపసంహరించుకుంటున్నట్లు మెహతా వెల్లడించారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!