

అందాల పోటీల్లో పాల్గొని మిస్ యూనివర్స్ ఇండియా వేదికపై మెరిసిన కొద్ది వారాలకే ఇంజనీర్ ఉమంగా కుమావత్ తిరిగి తన కార్పొరేట్ ఉద్యోగంలో చేరారు. జైపూర్‌లో జరిగిన మిస్ యూనివర్స్ ఇండియా 2026 జాతీయ ఫినాలేలో మధ్యప్రదేశ్‌కు ప్రాతినిథ్యం వహించిన ఆమె.. 52 మంది ఫైనలిస్టుల్లో టాప్ 20లో స్థానం సంపాదించారు. ఆగస్టు 23న జరిగిన ఫినాలేలో కేరళకు చెందిన కజియా లిజ్ మెజియా టైటిల్‌ను గెలుచుకున్నారు. అనంతరం సెప్టెంబర్ 14న బెంగళూరులోని గూగుల్ కార్యాలయం నుంచి ఉమంగా తన సాధారణ పనిదినానికి సంబంధించిన వీడియోను సోషల్ మీడియాలో పంచుకున్నారు.
“నా జీవితంలో ఒక రోజు” అనే క్యాప్షన్‌తో షేర్ చేసిన ఆ వీడియోలో ఆమె రోజువారీ జీవితం కనిపించింది. ఉదయం 9.30 గంటలకు రోజు ప్రారంభమై, ఆఫీస్‌కు వెళ్లేందుకు దుస్తులు ఎంపిక చేసుకోవడం నుంచి ఆమె పనిదినం మొదలవుతుంది. ఉదయం 10.30 గంటలకు కంపెనీ వెల్‌నెస్ సెంటర్‌కు వెళ్లిన ఉమంగా ట్రెడ్‌మిల్‌పై వ్యాయామం చేసి, అనంతరం స్ట్రెచింగ్, కాళ్లకు సంబంధించిన వ్యాయామాలు చేశారు. ఆ తర్వాత దుస్తులు సరిచేసుకుని మధ్యాహ్నం 12.30 గంటల సమయంలో ల్యాప్‌టాప్, నోట్‌బుక్, పత్రాలతో తన పనిలో నిమగ్నమయ్యారు.
మధ్యాహ్నం 2.10 గంటల సమయంలో గూగుల్ క్యాంటీన్‌లో నూడుల్ సూప్, ఆకుకూరలతో భోజనం చేసిన ఆమె.. అనంతరం మళ్లీ డెస్క్ వద్దకు చేరుకున్నారు. సాయంత్రం 4.30 గంటల సమయంలో ప్రశాంతమైన లాంజ్‌లో కొంత సమయం గడిపి, 5.30 గంటలకు కాఫీ విరామం తీసుకున్నారు. పనిగంటలు ముగిసిన తర్వాత ఎలివేటర్ వైపు వెళ్లడంతో వీడియో ముగుస్తుంది. సాధారణంగా అందాల పోటీల తర్వాత మోడలింగ్, సినిమాలు వంటి రంగాల్లోకి వెళ్లేవారు ఉండగా.. ఉమంగా మాత్రం తన కార్పొరేట్ ఉద్యోగంతో పాటు తనకు నచ్చిన అభిరుచులను కొనసాగిస్తూ ప్రత్యేకంగా నిలుస్తున్నారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!