

అయోధ్య రామమందిరంలోని విరాళాల వ్యవహారం గత కొన్ని వారాలుగా దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. జూన్ 7న సమాజ్వాదీ పార్టీ నేత, మాజీ మంత్రి పవన్ పాండే రామమందిర హుండీలు, కానుకల నుంచి రూ.5 కోట్ల నుంచి రూ.7.5 కోట్ల వరకు చోరీ జరిగిందని ఆరోపించారు. అదే రోజు సమాజ్వాదీ పార్టీ అధ్యక్షుడు అఖిలేష్ యాదవ్ కూడా ఈ అంశాన్ని సామాజిక మాధ్యమాల్లో ప్రస్తావించారు. అయితే రామమందిర ట్రస్ట్ ప్రధాన కార్యదర్శి చంపత్ రాయ్ ఈ ఆరోపణలను పూర్తిగా ఖండిస్తూ, ప్రతి విరాళానికి సంబంధించిన పూర్తి లెక్కలు ట్రస్ట్ వద్ద ఉన్నాయని స్పష్టం చేశారు. అనంతరం ప్రధానమంత్రి కార్యాలయం ట్రస్ట్ నుంచి సమగ్ర నివేదిక కోరగా, సంబంధిత అధికారులు పలు సమావేశాలు నిర్వహించారు.
ఈ వ్యవహారంలో ట్రస్ట్ మాజీ అకౌంటెంట్ మహిపాల్ సింగ్ విడుదల చేసిన వీడియో మరింత చర్చకు దారితీసింది. అనంతరం ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) ఏర్పాటు చేసి, ట్రస్ట్ ప్రతినిధులు, బ్యాంకు అధికారులు, నోట్ల లెక్కింపులో పాల్గొన్న ప్రైవేట్ సంస్థ ప్రతినిధులను విచారించింది. ట్రస్ట్ ఆర్థిక పత్రాలను పరిశీలించిన సిట్ జూన్ 23న తన ప్రాథమిక నివేదికను హోంశాఖకు సమర్పించింది. జూన్ 25న ఈ కేసులో ఎనిమిది మంది నిందితులపై ఎఫ్ఐఆర్ నమోదు చేసి, వారిని పోలీసులు అరెస్టు చేశారు. ఈ వ్యవహారంపై దర్యాప్తు కొనసాగుతోంది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!