

కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఎప్పటికీ భారత ప్రధానమంత్రి కాలేరని కేంద్ర హోంమంత్రి అమిత్ షా వ్యాఖ్యానించారు. ఆయన ప్రధాని కావాలనుకుంటే మాక్ పార్లమెంటులో మాత్రమే ఆ కల నెరవేరుతుందని ఎద్దేవా చేశారు. ఆదివారం చండీగఢ్‌లో రూ.258 కోట్ల విలువైన పలు అభివృద్ధి పనులను ప్రారంభించి, మరికొన్ని పనులకు శంకుస్థాపన చేసిన అనంతరం నిర్వహించిన సభలో షా ప్రసంగించారు. 1984లో సిక్కులపై జరిగిన హింసాకాండను ప్రస్తావిస్తూ.. దాని జ్ఞాపకాలు చెరిగిపోకముందే నవంబరు 1న రాహుల్ గాంధీ ‘చలో దిల్లీ’ పేరుతో కార్యక్రమం నిర్వహించారని విమర్శించారు. అబద్ధాలు చెప్పడం, అరాచకత్వాన్ని ప్రోత్సహించడం, పార్లమెంటు కార్యకలాపాలకు ఆటంకం కలిగించడం విపక్షాల వైఖరిగా మారిందని ఆరోపించారు. తన కుమారుడిని ప్రధానిని చేయాలన్న సోనియా గాంధీ ఆశ నెరవేరకపోవడంతోనే కాంగ్రెస్ మాక్ పార్లమెంటు మార్గాన్ని ఎంచుకుందని షా వ్యాఖ్యానించారు.
దీపావళి ముగిసే వరకు ‘చలో దిల్లీ’ కార్యక్రమాన్ని వాయిదా వేయాలని దిల్లీ వ్యాపారులు చేసిన విజ్ఞప్తిని ఇండియా కూటమి నేతలు పట్టించుకోలేదని అమిత్ షా విమర్శించారు. ఈ పరిణామాల ప్రభావం రాబోయే ఎన్నికల్లో కనిపిస్తుందని వ్యాఖ్యానించారు. మరోవైపు, ఇండియా కూటమి నిర్వహించిన ‘చలో దిల్లీ’ ర్యాలీని కేంద్ర మంత్రి జె.పి. నడ్డా ‘మూర్ఖ నాటకం’గా అభివర్ణించారు. ఎన్నికల్లో ఓటమిని జీర్ణించుకోలేక కాంగ్రెస్ రాజ్యాంగబద్ధ సంస్థలను లక్ష్యంగా చేసుకుంటోందని భాజపా అధ్యక్షుడు నితిన్ నబీన్ ఆరోపించారు. ‘ప్రజాస్వామ్యాన్ని కాపాడండి.. అరాచకత్వాన్ని తొలగించండి’ నినాదంతో భాజపా దేశవ్యాప్తంగా నిరసన ర్యాలీలు నిర్వహించింది. హరియాణాలోని రోహ్‌తక్‌లో జరిగిన ర్యాలీకి నబీన్ నేతృత్వం వహించారు. 1984 సిక్కు అల్లర్లపై కాంగ్రెస్, రాహుల్ గాంధీ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తూ పశ్చిమ దిల్లీలోని హరినగర్‌లోనూ భాజపా నిరసన ప్రదర్శన చేపట్టింది.




















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!