

పంజాబ్‌లోని ఫగ్వారాలో ఉన్న లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్సిటీ (LPU) క్యాంపస్‌లోని యూనీ మాల్లో సెప్టెంబర్ 26-27 మధ్య రాత్రి హింసాత్మక ఘటనలు, దోపిడీ చోటుచేసుకున్నాయి. ఈ ఘటనలో పీఎస్5 గేమింగ్ కన్సోళ్లు, మొబైల్ ఫోన్లు, ల్యాప్‌టాప్‌లు, ఖరీదైన పరిమళ ద్రవ్యాలు, లక్షల రూపాయల నగదు దోపిడీకి గురైనట్లు దుకాణదారులు తెలిపారు. మాల్లోని అద్దాల కౌంటర్లు ధ్వంసం కాగా, పలు షెల్ఫ్‌లు ఖాళీ అయ్యాయి. మరమ్మతుల కోసం కస్టమర్లు ఇచ్చిన ఫోన్లు కూడా చోరీకి గురైనట్లు ఓ దుకాణదారుడు వెల్లడించారు. అయితే పుస్తకాలు, స్టేషనరీ దుకాణాలను మాత్రం ఎవరూ తాకకపోవడం చర్చనీయాంశంగా మారింది.
దుకాణదారుల వివరాల ప్రకారం.. ఓ డిపార్ట్మెంటల్ స్టోర్‌లోని కౌంటర్ నుంచి సుమారు రూ.6-7 లక్షల నగదు కనిపించకుండా పోయింది. మొత్తం నష్టం రూ.80-90 లక్షల వరకు ఉండొచ్చని, అందులో రూ.70-80 లక్షల విలువైన సరుకు ఉందని అంచనా వేశారు. మరో ఎలక్ట్రానిక్స్ దుకాణదారుడు సుమారు రూ.2 లక్షల నగదు పోయిందని, మొత్తం నష్టం రూ.50 లక్షలకు మించి ఉంటుందని తెలిపారు. పీఎస్5 కన్సోళ్లతో పాటు ప్రాడా, అర్మానీ వంటి బ్రాండ్ల ఖరీదైన పరిమళ ద్రవ్యాలు కూడా దోపిడీకి గురైనట్లు చెప్పారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ముఖాలకు గుడ్డలు కట్టుకున్న వ్యక్తులు వస్తువులను తీసుకెళ్తున్నట్లు కొన్ని వీడియోల్లో కనిపించింది. ఘటనపై యూనివర్సిటీ సీసీటీవీ దృశ్యాలను పరిశీలిస్తూ, సుమారు 30-40 మంది విద్యార్థుల పాత్రపై విచారణ జరుపుతున్నట్లు సమాచారం.



కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!