

పనిమనిషిపై అత్యాచారానికి పాల్పడిన కేసులో జీవిత ఖైదు శిక్ష అనుభవిస్తున్న మాజీ ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణ కారాగారంలో చరవాణి వినియోగించారన్న కేసులో ప్రత్యేక దర్యాప్తు దళం (సిట్) విచారణను పూర్తి చేసింది. సంబంధిత వర్గాల సమాచారం ప్రకారం.. విచారణలో ప్రజ్వల్ తన తండ్రి రేవణ్ణ, తల్లి భవానీలతో ఫోన్‌లో మాట్లాడినట్లు అంగీకరించినట్లు తెలుస్తోంది. అయితే జైలులోకి చరవాణిని ఎవరు తీసుకొచ్చి ఇచ్చారనే విషయంపై మాత్రం ఆయన ఎలాంటి వివరాలు వెల్లడించలేదని సమాచారం. విచారణలో ఇబ్బందికరంగా అనిపించిన సందర్భాల్లో తాను మాజీ ఎంపీని, మాజీ ప్రధాని మనవడినని ప్రస్తావిస్తూ వాదించినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. తనను అనవసరంగా ఇబ్బందిపెట్టేలా విచారణ జరిపితే న్యాయపోరాటం చేస్తానని హెచ్చరించినట్లు సమాచారం.
ఇదే కేసుకు సంబంధించి మరో నిందితుడు ప్రతాప్‌ను కూడా సిట్ అధికారులు తీవ్రంగా విచారించినట్లు తెలుస్తోంది. ప్రజ్వల్ రేవణ్ణ, ప్రతాప్‌లను గురువారం 42వ ఏసీజేఎం కోర్టు ముందు హాజరుపరిచారు. ఇద్దరినీ రెండు వారాల పాటు న్యాయనిర్బంధంలో ఉంచాలని న్యాయమూర్తి ఆదేశించారు. ప్రజ్వల్ నుంచి స్వాధీనం చేసుకున్న చరవాణిలో పలు ఓటీటీ యాప్‌లతో పాటు అశ్లీల కంటెంట్ ఉన్నట్లు దర్యాప్తులో గుర్తించినట్లు అధికారులు తెలిపారు. ఆ ఫోన్ నుంచి ఎవరెవరికి కాల్స్ వెళ్లాయో, ఎవరితో సంభాషణలు జరిగాయో తెలుసుకునేందుకు నిపుణుల సహకారంతో సాంకేతిక విశ్లేషణ చేపడుతున్నారు. జైలులోకి ఫోన్ ఎలా చేరింది, దాన్ని ఎవరు అందించారనే అంశాలపై దర్యాప్తు కొనసాగుతోంది.

కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!