

ప్రస్తుతం పెళ్లిళ్ల సీజన్ కొనసాగుతుండటంతో కొత్తగా వివాహమైన జంటలు హనీమూన్ ప్రయాణాలకు ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నారు. చలికాలంలో సిమ్లా, మనాలీ, రాజస్థాన్ వంటి ప్రాంతాలు ఎక్కువగా గుర్తుకు వచ్చినా, దేశంలో మరికొన్ని అందమైన పర్యాటక ప్రదేశాలు కూడా ఉన్నాయి. ఉత్తర సిక్కింలోని లాచెన్, తంగు లోయ అలాంటి ప్రత్యేకమైన ప్రాంతాలు. సముద్ర మట్టానికి సుమారు 3,950 మీటర్ల ఎత్తులో ఉండే తంగు లోయ మంచుతో కప్పబడిన పర్వతాలు, ప్రకృతి అందాలకు ప్రసిద్ధి. గురుడోంగ్మార్, చోప్టా సరస్సులకు వెళ్లే మార్గంలో ఈ ప్రాంతం ఉంటుంది. అయితే, చలికాలంలో ఇక్కడికి వెళ్లాలనుకునే వారు వాతావరణ పరిస్థితులు, రహదారి మార్గాలు, అవసరమైన అనుమతుల గురించి ముందుగానే తెలుసుకోవాలి.
పశ్చిమ బెంగాల్‌లోని డార్జిలింగ్ కూడా ప్రముఖ హనీమూన్ గమ్యస్థానంగా గుర్తింపు పొందింది. క్వీన్ ఆఫ్ ది హిల్స్‌గా పేరొందిన ఈ ప్రాంతంలో టైగర్ హిల్, కాంచనజంగా పర్వత శ్రేణుల అందాలు, డార్జిలింగ్ హిమాలయన్ రైల్వే, టీ తోటలు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయి. నవంబర్ నుంచి ఈ ప్రాంతాన్ని సందర్శించేందుకు అనువైన సమయంగా భావిస్తారు. హిమాచల్ ప్రదేశ్‌లోని మనాలీ కూడా కొత్త జంటలను ఆకర్షించే పర్యాటక ప్రాంతం. మంచుతో కప్పబడిన పర్వతాలు, పచ్చని లోయలు, నదులు, జలపాతాలు ఇక్కడి ప్రత్యేకతలు. సమీపంలోని సజ్లా గ్రామం, షాంఘర్ గ్రామం, రాణి నాలా, పాండు రోపా వంటి ప్రాంతాలు ప్రకృతి ప్రేమికులను ఆకట్టుకుంటాయి. ఈ ప్రాంతాలు కొత్త జంటలకు చలికాలపు సెలవుల్లో మధురమైన జ్ఞాపకాలను అందించగలవు.














కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!