

సోమాలియా సముద్రపు దొంగలు హైజాక్ చేసిన ఇంధన నౌకలో ఐదుగురు సిబ్బంది మృతి చెందారు. మృతుల్లో ఒక భారతీయ నావికుడు, ముగ్గురు పాకిస్థానీయులు, ఒక మయన్మార్ జాతీయుడు ఉన్నారు. మరో భారతీయుడు, ముగ్గురు పాకిస్థానీయులు గాయపడ్డారు. పలావు జెండాతో ప్రయాణిస్తున్న ‘ఎంటీ హానర్ 25’ను ఏప్రిల్‌లో సోమాలియా తీరంలో పైరేట్లు హైజాక్ చేశారు. నౌకలో 17 మంది సిబ్బంది ఉన్నట్లు అధికారులు తెలిపారు. అనంతరం పుంట్‌ల్యాండ్ భద్రతా బలగాలు ప్రత్యేక ఆపరేషన్ నిర్వహించి నౌకను తమ ఆధీనంలోకి తీసుకున్నాయి. ఈ ఆపరేషన్‌లో పలువురు అనుమానిత పైరేట్లను అదుపులోకి తీసుకున్నట్లు పుంట్‌ల్యాండ్ అధికారులు తెలిపారు.
మరో ఘటనలో ‘ఎంటీ యురేకా’ అనే టోగో జెండా ఇంధన నౌకను కూడా పుంట్‌ల్యాండ్ భద్రతా బలగాలు స్వాధీనం చేసుకున్నాయి. మేలో యెమన్‌లోని ఖానా ఓడరేవు సమీపంలో హైజాక్‌కు గురైన ఈ నౌకలో 12 మంది సిబ్బంది ఉన్నారు. వారిలో ఎనిమిది మంది ఈజిప్ట్ జాతీయులు, నలుగురు భారతీయులు ఉన్నారు. భద్రతా బలగాలు సమీపించడంతో పైరేట్లు నౌకను విడిచిపెట్టి తీర ప్రాంతానికి పారిపోయినట్లు అధికారులు తెలిపారు. నౌకను దెబ్బతీసి, కొంత భాగానికి నిప్పంటించినట్లు సమాచారం.


కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!