

లోక్సభలో మెదక్ ఎంపీ ఎం. రఘునందన్ రావు అడిగిన ప్రశ్నలకు కేంద్ర ప్రభుత్వం లిఖితపూర్వక సమాధానాలు ఇచ్చింది. కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి పంకజ్ చౌదరి వెల్లడించిన వివరాల ప్రకారం, స్కీం ఫర్ స్పెషల్ అసిస్టెన్స్ టు స్టేట్స్ ఫర్ కాపిటల్ ఇన్వెస్ట్మెంట్ (SASCI) కింద 2020–21 నుంచి 2026–27 వరకు తెలంగాణకు మొత్తం రూ.13,725.29 కోట్లు విడుదలయ్యాయి. ఇందులో 2020–21లో రూ.358 కోట్లు, 2021–22లో రూ.214 కోట్లు, 2022–23లో రూ.2,500.98 కోట్లు, 2023–24లో రూ.1,948.34 కోట్లు, 2024–25లో రూ.2,727.24 కోట్లు, 2025–26లో రూ.4,208.83 కోట్లు, 2026–27లో ఇప్పటివరకు రూ.1,767.90 కోట్లు విడుదల చేసినట్లు పేర్కొన్నారు.
మరో లిఖితపూర్వక సమాధానంలో కేంద్ర మంత్రి హర్ష్ మల్హోత్రా మాట్లాడుతూ, ప్రైమ్ మినిస్టర్ ఇంటర్న్షిప్ స్కీం కింద తెలంగాణ నుంచి 410 మంది యువత మై భారత్ పోర్టల్ ద్వారా దరఖాస్తు చేసుకున్నట్లు తెలిపారు. దేశవ్యాప్తంగా ఇప్పటివరకు 98 వేల మంది యువత ఈ పథకంపై ఆసక్తి చూపినట్లు వెల్లడించారు. యువతకు నైపుణ్యాభివృద్ధి, పరిశ్రమల్లో ప్రత్యక్ష అనుభవం కల్పించి ఉపాధి అవకాశాలను మెరుగుపరచడమే ఈ పథకం లక్ష్యమని పేర్కొన్నారు. ఈ సమాధానాలతో రాష్ట్రానికి కేంద్రం అందిస్తున్న మూలధన సహాయం, యువత ఉపాధి పథకాలపై స్పందనపై స్పష్టత లభించింది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!