

అండాల అక్రమ సేకరణ వ్యవహారంపై పోలీసులు దర్యాప్తును మరింత ముమ్మరం చేశారు. వివిధ రాష్ట్రాల నుంచి మహిళలను అక్రమంగా తరలించి ఫర్టిలిటీ కేంద్రాలకు తీసుకొచ్చి అండాలు సేకరించారా? డబ్బు ఆశ చూపి వారిని ఈ ప్రక్రియకు ఒప్పించారా? నకిలీ పత్రాలను తయారు చేసి వినియోగించారా? ఈ వ్యవహారం వెనుక వ్యవస్థీకృత ముఠాలు, మధ్యవర్తులు, సంస్థల ప్రతినిధుల ప్రమేయం ఉందా? అనే కోణాల్లో విచారణ కొనసాగుతోంది. ఈ కేసులో పలు ఫర్టిలిటీ కేంద్రాలు, అసిస్టెడ్ రిప్రొడక్టివ్ టెక్నాలజీ (ఏఆర్టీ) బ్యాంకులు, వాటి ప్రతినిధులు, మధ్యవర్తుల పాత్రపై అనుమానాలు ఉన్నాయని పోలీసులు శుక్రవారం విడుదల చేసిన ప్రకటనలో తెలిపారు. ఇప్పటికే అరెస్టయిన నిందితుడు ఎమిరిశెట్టి దుర్గాప్రసాద్‌ను విచారించే క్రమంలో కొత్త ఆధారాలు లభించడంతో, మరిన్ని వివరాలు సేకరించేందుకు అతడిని అదనపు కస్టడీలోకి తీసుకున్నట్లు వెల్లడించారు.
వివిధ ఏఆర్టీ బ్యాంకులు, ఫర్టిలిటీ కేంద్రాలకు మహిళలను పరిచయం చేయడంలో దుర్గాప్రసాద్ పాత్ర ఏమిటి? అతడికి ఎవరెవరితో సంబంధాలు ఉన్నాయి? అతడి ఆర్థిక లావాదేవీలు, సహచరులు ఎవరు? అనే అంశాలపై పోలీసులు లోతుగా విచారిస్తున్నారు. హైదరాబాద్‌లోని ఒయాసిస్ హాస్పిటల్స్ కార్పొరేట్ కార్యాలయంలో తనిఖీలు నిర్వహించి ల్యాప్‌టాప్‌లు, ఇతర డిజిటల్ పరికరాలు, డోనర్ రిఫరల్స్‌కు సంబంధించిన రికార్డులు, పత్రాలు, ఆర్థిక లావాదేవీల వివరాలను స్వాధీనం చేసుకున్నారు. వీటిని ఫోరెన్సిక్ విశ్లేషణకు పంపిస్తున్నారు. మహిళల నియామకం, రిఫరల్ కోసం కమీషన్ల ఆధారంగా వ్యవస్థీకృత విధానం అమలులో ఉందా? నిర్వహణ సంస్థల బాధ్యులు, డైరెక్టర్లు, కోఆర్డినేటర్లు, ఏజెంట్ల పాత్ర ఎంతవరకు ఉంది? అనే అంశాలపై దర్యాప్తు కొనసాగుతోంది.




















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!