

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రాష్ట్రంలోని ఆక్వా రైతులు, రొయ్యల ఎగుమతిదారులు ఎదుర్కొంటున్న సంక్షోభంపై కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ కు లేఖ రాశారు. అమెరికా విధిస్తున్న 50 శాతం సుంకంతో భారత రొయ్యల ఎగుమతులపై దాదాపు 60 శాతం పన్ను భారం పడుతోందని ఆయన పేర్కొన్నారు. దీని ప్రభావంతో రాష్ట్రంలోని రూ.25 వేల కోట్ల ఆక్వా ఎగుమతులు ప్రమాదంలో పడగా, 2.5 లక్షల ఆక్వా రైతు కుటుంబాలు, 30 లక్షలకుపైగా కార్మికుల ఉపాధి దెబ్బతినే పరిస్థితి ఏర్పడిందని తెలిపారు.
దేశీయ మార్కెట్లో కూడా ఆక్వా ఉత్పత్తుల ధరలు 20-25 శాతం వరకు పడిపోయాయని సీఎం వెల్లడించారు. రైతులకు ఉపశమనం కల్పించేందుకు వర్కింగ్ క్యాపిటల్ పరిమితులు పెంచడం, వడ్డీ చెల్లింపులపై 240 రోజుల మారటోరియం, 5 శాతం వడ్డీ మరియు జీఎస్టీ నుంచి తాత్కాలిక మినహాయింపులు ఇవ్వాలని కోరారు. అలాగే రష్యా, యూరోపియన్ యూనియన్, ఆస్ట్రేలియా వంటి ప్రత్యామ్నాయ మార్కెట్లలో ఎగుమతులు పెంచే చర్యలు చేపట్టాలని విజ్ఞప్తి చేశారు. మరో లేఖలో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కు రూ.100 కోట్ల కార్పస్ ఫండ్ మంజూరు చేసి ప్రాన్ ప్రొడ్యూసర్స్ కోఆర్డినేషన్ కమిటీ ఏర్పాటు చేయాలని, అదనపు రీజినల్ ఫిషరీస్ ఇనిస్టిట్యూట్ ఏర్పాటు చేయాలని సీఎం కోరారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!