

ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలతో ముంబయి నగరం అస్తవ్యస్తమైంది. లోతట్టు ప్రాంతాలు జలమయమవగా, రహదారులపై నీరు పోటెత్తడంతో వాహనాల రాకపోకలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. గత 24 గంటల్లో పలు ప్రాంతాల్లో 20 నుంచి 30 సెం.మీ. వరకు వర్షపాతం నమోదవడంతో భారత వాతావరణ శాఖ (ఐఎండీ) రెడ్ అలర్ట్ ప్రకటించింది. అత్యవసరమైతే తప్ప ప్రజలు ఇళ్ల నుంచి బయటకు రావద్దని బృహన్ ముంబయి మున్సిపల్ కార్పొరేషన్ (బీఎంసీ) సూచించింది. అధికారుల ప్రకారం ప్రజా రవాణా సేవలు కొనసాగుతున్నప్పటికీ, పలు ప్రాంతాల్లో మెట్రో సేవలకు అంతరాయం ఏర్పడినట్లు ప్రయాణికులు తెలిపారు.
భారీ వర్షాల ప్రభావం థానే, పాల్ఘర్, నవీ ముంబయి, పుణె ప్రాంతాల్లోనూ తీవ్రంగా కనిపిస్తోంది. పలుచోట్ల కొండచరియలు విరిగిపడగా, రహదారులు నీటమునిగాయి. జలదిగ్బంధంలో చిక్కుకున్న వారిని సురక్షిత ప్రాంతాలకు తరలించే చర్యలు కొనసాగుతున్నాయి. సముద్ర అలలు 4.19 మీటర్ల ఎత్తుకు ఎగసే అవకాశం ఉండటంతో తీరప్రాంత ప్రజలను అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరించారు. ఇదిలా ఉండగా, బాంద్రా ప్రాంతంలో ప్రముఖ పారిశ్రామికవేత్త ముకేశ్ అంబానీ భద్రతా కాన్వాయ్ ముందు భారీ చెట్టు కూలిపోవడంతో తృటిలో ప్రమాదం తప్పింది. అధికారులు వెంటనే చెట్టును తొలగించి ట్రాఫిక్‌ను పునరుద్ధరించారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!