

తమిళనాడులో విజయ్ నేతృత్వంలోని ప్రభుత్వంపై మాజీ ముఖ్యమంత్రి, డీఎంకే నేత ఎంకే స్టాలిన్ విమర్శలు గుప్పించారు. ఇటీవల డ్రగ్స్ అక్రమ రవాణా కేసులో టీవీకేకు చెందిన నేత అరెస్టవడం, తాజాగా తేనిలోని జైలు నుంచి ఖైదీలు పరారైనట్లు వచ్చిన వార్తల నేపథ్యంలో ఆయన స్పందించారు. రాష్ట్రంలో శాంతిభద్రతల పరిస్థితిని ప్రముఖ వెబ్‌సిరీస్‌ల పేర్లతో పోలుస్తూ సోషల్ మీడియా వేదికగా ప్రభుత్వాన్ని విమర్శించారు. ‘బ్రేకింగ్ బ్యాడ్’ తర్వాత ఇప్పుడు ‘ప్రిజన్ బ్రేక్’ మొదలైందంటూ ఎక్స్‌లో పోస్టు పెట్టారు.
జైళ్లలో ఉన్న ఖైదీలు తప్పించుకుంటున్నా ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోవడం లేదని స్టాలిన్ ఆరోపించారు. గతంలో పుళల్ జైలు నుంచి ఇద్దరు ఖైదీలు పరారైన ఘటనను ప్రస్తావిస్తూ, తాజాగా తేని జైలు నుంచి 17 మంది తప్పించుకున్నారని పేర్కొన్నారు. 1995 తర్వాత ఒకేసారి ఇంతమంది ఖైదీలు పరారవడం ఇదే తొలిసారి అని సమాచారం ఉందన్నారు. మరోవైపు, రూ.100 కోట్ల విలువైన 135 కిలోల డ్రగ్స్ అక్రమ రవాణా కేసులో నాగపట్టణానికి చెందిన టీవీకే నేత అరెస్టు కావడంపైనా స్టాలిన్ గతంలో విమర్శలు చేశారు. ఆ సందర్భంలో టీవీకేను ‘బ్యాడ్ పార్టీ’గా, ‘బ్రేకింగ్ బ్యాడ్ పార్టీ’గా అభివర్ణించారు. తాజా పోస్టులోనూ వెబ్‌సిరీస్‌ల పేర్లను ప్రస్తావిస్తూ ప్రభుత్వంపై విమర్శలు కొనసాగించారు.


కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!