

అర్నబ్ తుపాను ప్రభావంతో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, ఒడిశా సహా పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్న నేపథ్యంలో దక్షిణ మధ్య రైల్వే అప్రమత్తమైంది. ప్రయాణికులు, రైల్వే సిబ్బంది, ఆస్తుల భద్రతను దృష్టిలో ఉంచుకుని పరిస్థితులకు అనుగుణంగా రైళ్ల రాకపోకల్లో మార్పులు చేయాల్సి రావచ్చని అధికారులు తెలిపారు. భారత వాతావరణ శాఖ అక్టోబర్ 28న ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం, ములుగు, మహబూబాబాద్ జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేసింది. అక్టోబర్ 28, 29 తేదీల్లో వరంగల్, హనుమకొండ, సూర్యాపేట, నల్గొండ జిల్లాల్లోనూ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హెచ్చరించింది. తుపాను అక్టోబర్ 28న బాపట్ల, విశాఖపట్నం మధ్య ఆంధ్రప్రదేశ్ తీరాన్ని దాటే అవకాశం ఉందన్న అంచనాల నేపథ్యంలో, ప్రభావిత మార్గాల్లో కొన్ని రైళ్లను రద్దు చేయడం, దారి మళ్లించడం లేదా వాటి సమయాలను మార్చడం జరిగే అవకాశం ఉంది.
దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ సంజయ్ కుమార్ శ్రీవాస్తవ, సికింద్రాబాద్ డివిజన్ డివిజనల్ రైల్వే మేనేజర్ డాక్టర్ ఆర్. గోపాలకృష్ణన్‌తో పాటు ఇతర అధికారులతో భద్రతా ఏర్పాట్లపై సమీక్ష నిర్వహించారు. ప్రమాదకర ప్రాంతాలు, వంతెనలు, నీటి మట్టాలు, గస్తీ ఏర్పాట్లను పరిశీలించడంతో పాటు కాజీపేట, డోర్నకల్ ప్రాంతాల్లో సహాయక రైళ్లు, వైద్య సహాయక పరికరాల సంసిద్ధతను సమీక్షించారు. ప్రయాణికులు ప్రయాణానికి ముందు తమ రైళ్ల స్థితిని ఐఆర్‌సీటీసీ, రైల్ వన్, ఎన్‌టీఈఎస్ అధికారిక యాప్‌లు లేదా వెబ్‌సైట్లలో తనిఖీ చేసుకోవాలని, అవసరమైతే 139కు ఫోన్ చేయాలని రైల్వే అధికారులు సూచించారు. రైళ్ల రద్దు, దారి మళ్లింపు, పాక్షిక రద్దు, సమయ మార్పుల వివరాలను ప్రయాణికులకు ఎస్‌ఎంఎస్ ద్వారా తెలియజేయడంతో పాటు అధికారిక వెబ్‌సైట్, సామాజిక మాధ్యమాలు, వార్తా మాధ్యమాల ద్వారా వెల్లడిస్తామని తెలిపారు.


కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!