

బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తెలంగాణలో నెలకొన్న కరువు పరిస్థితులపై కాంగ్రెస్ ప్రభుత్వాన్ని తీవ్రంగా విమర్శించారు. మంగళవారం తెలంగాణ భవన్‌లో నిర్మల్ జిల్లాకు చెందిన బీజేపీ, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు బీఆర్ఎస్‌లో చేరిన సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రంలో రైతులు ఎదుర్కొంటున్న ఇబ్బందులకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వమే బాధ్యత వహించాలని అన్నారు. గోదావరి, కృష్ణా నదుల్లో నీరు అందుబాటులో ఉన్నప్పటికీ తెలంగాణలో పంటలు ఎండిపోవడం ప్రభుత్వ వైఫల్యానికి నిదర్శనమని ఆరోపించారు. కన్నెపల్లి పంప్‌హౌస్‌లో మోటార్లు ఆన్ చేసి ఉంటే రైతులకు సాగునీరు అందేదని, కాళేశ్వరం ప్రాజెక్టు పంపులను నడపకపోవడంతో గోదావరి జలాలను సద్వినియోగం చేసుకోలేకపోయారని విమర్శించారు. కేసీఆర్‌కు పేరు వస్తుందనే రాజకీయ కారణాలతోనే ప్రభుత్వం సాగునీటి విషయంలో నిర్లక్ష్యం చేస్తోందని కేటీఆర్ ఆరోపించారు.
గోదావరి నుంచి 750 టీఎంసీలు, కృష్ణా నది నుంచి 250 టీఎంసీల నీటిని వినియోగించుకునే అవకాశం ఉన్నప్పటికీ, రాష్ట్ర ప్రభుత్వం వెయ్యి టీఎంసీల నీటిని సద్వినియోగం చేసుకోవడంలో విఫలమైందని కేటీఆర్ అన్నారు. వాతావరణ హెచ్చరికలు ముందుగానే ఉన్నప్పటికీ నీటి నిల్వలను పెంచుకునేందుకు చర్యలు తీసుకోలేదని విమర్శించారు. కాళేశ్వరం, పాలమూరు–రంగారెడ్డి ఎత్తిపోతల పథకాలను పూర్తిస్థాయిలో వినియోగించుకోవాలని సూచించారు. రైతుబంధు, విద్యుత్ సరఫరా, యూరియా, సాగునీటి కొరతతో రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్‌లో నీటిని వ్యవసాయానికి వినియోగిస్తుండగా, తెలంగాణలో నదుల నీరు సముద్రంలోకి వృథాగా వెళ్తోందని ఆరోపించారు. రాజకీయ విమర్శలను పక్కనపెట్టి సాగునీటి ప్రాజెక్టుల పంపులను వెంటనే ప్రారంభించి రైతుల పంటలను కాపాడాలని రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని కేటీఆర్ డిమాండ్ చేశారు.




కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!