

ఖేలో ఇండియా యూత్ గేమ్స్–2026ను దేశం గర్వించేలా, జాతీయ స్థాయిలో తెలంగాణ ప్రతిష్టను చాటిచెప్పేలా విజయవంతంగా నిర్వహించాలని రాష్ట్ర క్రీడలు, యువజన సర్వీసుల శాఖ మంత్రి వాకిటి శ్రీహరి అధికారులకు సూచించారు. బేగంపేటలోని టూరిస్ట్ ప్లాజాలో వివిధ జిల్లాల డిప్యూటీ కలెక్టర్లు, క్రీడాశాఖ అధికారులతో నిర్వహించిన సమీక్ష సమావేశంలో ఆయన మాట్లాడారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పట్టుదల, కృషి వల్లే ఈ ప్రతిష్టాత్మక క్రీడా పోటీల నిర్వహణ బాధ్యతలు తెలంగాణకు దక్కాయని తెలిపారు. నిర్వహణలో ఎలాంటి లోపాలకు తావివ్వకుండా పక్కా ప్రణాళిక, సమన్వయంతో పనిచేయాలని అధికారులకు సూచించారు. క్రీడా మౌలిక సదుపాయాలను మెరుగుపరిచి, వాటిని భవిష్యత్ తరాలకు ఉపయోగపడేలా అభివృద్ధి చేయాలని చెప్పారు. యువత సోషల్ మీడియా, బెట్టింగ్‌కు దూరంగా ఉండి క్రీడల వైపు మళ్లాలని, గ్రామీణ ప్రాంతాల్లోని ప్రతిభావంతులను గుర్తించి ప్రోత్సహించాలని పిలుపునిచ్చారు.
ఖేలో ఇండియా నిర్వహణ కోసం మొత్తం రూ.203 కోట్లతో ఏర్పాట్లు చేస్తున్నట్లు ప్రభుత్వ స్పెషల్ చీఫ్ సెక్రటరీ వాణీ ప్రసాద్ వెల్లడించారు. ఇందులో రూ.120 కోట్లను క్రీడా మౌలిక సదుపాయాల అభివృద్ధికి కేటాయించినట్లు తెలిపారు. ఇప్పటికే 11 స్టేడియాలు సిద్ధమయ్యాయని, మరో ఐదు స్టేడియాల్లో పనులు కొనసాగుతున్నాయని స్పోర్ట్స్ అథారిటీ వీసీ, ఎండీ సోనిబాలాదేవి వివరించారు. పనుల పురోగతిని పర్యవేక్షించేందుకు ప్రత్యేక ఐఎంఎస్ పోర్టల్‌ను ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. మరోవైపు, క్రీడల నిర్వహణలో నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్ శివసేన రెడ్డి హెచ్చరించారు. క్రీడాకారులు, కోచ్‌లు, అతిథులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అన్ని ఏర్పాట్లను సకాలంలో పూర్తి చేయాలని అధికారులు, సిబ్బందికి సూచించారు.




















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!