

టాలీవుడ్ యూత్ ఫేవరెట్ డైరెక్టర్ తరుణ్ భాస్కర్ తెరకెక్కించిన కల్ట్ కామెడీ ఈ నగరానికి ఏమైంది సినిమాకు సీక్వెల్‌గా ఈ నగరానికి ఏమైంది 2 ప్రేక్షకుల ముందుకు రానుంది. విశ్వక్ సేన్, అభినవ్ గోమఠం, వెంకటేష్ కాకుమాను, సాయినాథ్ మాగంటి, సిమ్రాన్ చౌదరి ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రం నవంబర్ 19న థియేటర్లలో విడుదల కానుంది. సినిమా ప్రమోషన్లలో భాగంగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న తరుణ్ భాస్కర్ సోషల్ మీడియా రివ్యూవర్ల తీరుపై అసహనం వ్యక్తం చేశారు. ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ పేరుతో కొందరు సోషల్ మీడియాలో హద్దులు దాటుతున్నారని విమర్శించారు. రాజకీయాల గురించి మాట్లాడేటప్పుడు కనిపించని ఉత్సాహం, ధైర్యం సినిమాలను విమర్శించే విషయంలో మాత్రం కొందరిలో ఎక్కువగా కనిపిస్తున్నాయని వ్యాఖ్యానించారు.
సినిమా నచ్చలేదని చెప్పే హక్కు ప్రతి ఒక్కరికీ ఉందని, అయితే ఓ సన్నివేశాన్ని ఎలా తెరకెక్కించాల్సిందో సూచిస్తూ విమర్శలు చేసేవారిని చూస్తే, అంత బాగా తెలుసనుకుంటే మీరే సినిమా తీసి చూపించండి అనాలనిపిస్తుందని తరుణ్ భాస్కర్ అన్నారు. సోషల్ మీడియాలో నెగెటివిటీని ప్రచారం చేసేవారు కేవలం ఒక శాతం మాత్రమేనని, మిగిలిన 99 శాతం మంది ప్రేక్షకులు ఎలాంటి కామెంట్లు చేయకుండా థియేటర్లకు వెళ్లి టికెట్లు కొనుగోలు చేసి సినిమాలను ఆస్వాదిస్తారని పేర్కొన్నారు. రివ్యూలు ఇవ్వడంపై తనకు ఎలాంటి అభ్యంతరం లేదని స్పష్టం చేస్తూనే, ‘ఇది పాత జోక్.. దీనికి నవ్వకండి’ అంటూ ప్రేక్షకుల స్పందనను ప్రభావితం చేసే వ్యాఖ్యలు చేయడం సరికాదన్నారు. ప్రేక్షకులు దేనికి నవ్వాలో, దేనికి నవ్వకూడదో నిర్ణయించడానికి రివ్యూవర్లు ఎవరని ప్రశ్నించారు. ప్రతి ఒక్కరికీ తమదైన రీతిలో సినిమాను ఆస్వాదించే స్వేచ్ఛ ఉండాలని అభిప్రాయపడ్డారు.




















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!