

విశాఖపట్నంలో రాష్ట్రంలోనే తొలిసారిగా స్లమ్ రీడెవలప్‌మెంట్ కార్యక్రమానికి ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. విశాఖ ఎకనమిక్ రీజియన్ డెవలప్‌మెంట్‌లో భాగంగా చేపడుతున్న ఈ కార్యక్రమంలో భాగంగా వేలంపేట మురికివాడ పునర్నిర్మాణానికి రాష్ట్ర మంత్రి నారాయణ భూమిపూజ చేశారు. దాదాపు 50 ఏళ్లుగా సరైన నివాస సదుపాయాలు లేక ఇబ్బందులు ఎదుర్కొంటున్న 177 కుటుంబాలకు ఈ ప్రాజెక్ట్ ద్వారా ప్రయోజనం కలగనుంది. మొత్తం 177 యూనిట్లను నిర్మించనుండగా.. ఒక్కో యూనిట్‌కు సుమారు 2,691 చదరపు అడుగుల విస్తీర్ణం, మొత్తం నిర్మాణం సుమారు 45 మీటర్ల ఎత్తుతో ఉండేలా ప్రణాళిక రూపొందించారు.
మంత్రి నారాయణ తెలిపిన వివరాల ప్రకారం.. వేలంపేట స్లమ్ రీడెవలప్‌మెంట్ ప్రాజెక్ట్‌ను రూ.28.44 కోట్ల వ్యయంతో చేపడుతున్నారు. ఒక్కో యూనిట్ విలువ సుమారు రూ.16.07 లక్షలు ఉంటుందని తెలిపారు. షియర్ వాల్ టెక్నాలజీతో 12 అంతస్తుల భవనాన్ని నిర్మించనున్నారు. ప్రాజెక్ట్‌ను తొమ్మిది నెలల్లో పూర్తి చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. రాష్ట్రంలో ఇది తొలి మోడల్ ప్రాజెక్ట్ అని పేర్కొన్న మంత్రి.. ఇదే తరహాలో రాష్ట్రంలోని ఇతర మురికివాడలను కూడా అభివృద్ధి చేసేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నామని తెలిపారు. పట్టణ పేదల జీవన ప్రమాణాలను మెరుగుపరిచే దిశగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని అన్నారు.



కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!