

ప్రపంచవ్యాప్తంగా 178 సంస్థలకు చెందిన వెబ్‌సైట్లు భారీ సైబర్ దాడి ప్రభావానికి గురైనట్లు సైబర్ సెక్యూరిటీ సంస్థ రిపోర్ట్ యూఆర్ఐ వెల్లడించింది. నవంబర్ 16న ఈ వెబ్‌సైట్లను సందర్శించిన వినియోగదారులు ‘ఆప్టిమైజ్లీ వెబ్ ఎక్స్‌పెరిమెంటేషన్’ ప్లాట్‌ఫామ్‌కు సంబంధించిన అనుమానాస్పద జావాస్క్రిప్ట్ బారినపడినట్లు ఓ పోస్టులో పేర్కొంది. ఈ ఘటనలో జరిగిన నష్టం పరిమితంగానే ఉన్నట్లు సమాచారం. అయితే, వివిధ రంగాలకు చెందిన ప్రముఖ సంస్థల వెబ్‌సైట్లు ప్రభావితమవడం ఆందోళన కలిగిస్తోంది. ఈ జాబితాలో జూమ్, బీబీసీ, సీఎన్‌ఎన్, సేల్స్‌ఫోర్స్, గిట్‌ల్యాబ్, ఐకియా, హెచ్‌ఎస్‌బీసీ, ఈక్విఫాక్స్, ఎయిర్ ఫ్రాన్స్-కేఎల్ఎం, లెడ్జర్, పీకాక్ వంటి సంస్థలు ఉన్నట్లు రిపోర్ట్ యూఆర్ఐ తెలిపింది.
ఈ మాల్‌వేర్ ఒక మల్టీపర్పస్ టూల్‌కిట్‌గా పనిచేస్తుందని, వినియోగదారుల సున్నితమైన సమాచారాన్ని దొంగిలించడంతో పాటు ఆన్‌లైన్ లావాదేవీలకు అంతరాయం కలిగించగలదని సైబర్ సెక్యూరిటీ సంస్థ పేర్కొంది. క్రిప్టోకరెన్సీ వాలెట్ చిరునామాలను హ్యాకర్లకు చెందిన చిరునామాలతో మార్చడం, పేమెంట్ కార్డు వివరాలను కాపీ చేయడం, కుకీలు, స్క్రీన్‌షాట్‌లను దొంగిలించడం దీని సామర్థ్యాల్లో ఉన్నాయని వెల్లడించింది. అంతేకాకుండా, ఐఫోన్లు, ఐప్యాడ్లలోకి ‘కొరునా’, ‘డార్క్‌స్వోర్డ్’ ఐఓఎస్ ఎక్స్‌ప్లాయిట్ కిట్‌లను ప్రవేశపెట్టేందుకు కూడా దాడి చేసినవారు ప్రయత్నించినట్లు తెలిపింది. ఈ సమస్య గురించి తెలుసుకున్న వెంటనే ఆప్టిమైజ్లీ లోపాన్ని సరిచేసి, తమ కస్టమర్లకు సమాచారం అందించింది. థర్డ్‌పార్టీ ప్లాట్‌ఫామ్‌ల వినియోగంలో అప్రమత్తతతో పాటు వెబ్‌సైట్ల భద్రత, వినియోగదారుల వ్యక్తిగత మరియు ఆర్థిక సమాచార రక్షణ ఎంత ముఖ్యమో ఈ ఘటన మరోసారి గుర్తుచేస్తోంది.




















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!