

ఆర్నాబ్, మురుసు తుఫాన్ల ప్రభావంతో ఇప్పటికే నష్టాన్ని ఎదుర్కొన్న ఆంధ్రప్రదేశ్‌కు మరో తుఫాను ముప్పు పొంచి ఉందనే అంచనాలు వెలువడుతున్నాయి. గత తుఫాన్ల నుంచి తీర ప్రాంతాలు పూర్తిగా కోలుకోకముందే నవంబర్ 15 తర్వాత బంగాళాఖాతంలో మరో తుఫాను ఏర్పడే అవకాశం ఉందని వాతావరణ నమూనాలు సూచిస్తున్నాయి. ఈ వాతావరణ వ్యవస్థ ప్రభావం కోస్తాంధ్ర, రాయలసీమతో పాటు ఉత్తర తమిళనాడు తీర ప్రాంతాలపై ఉండవచ్చని అంచనా వేస్తున్నారు. సాధారణంగా నవంబర్, డిసెంబర్ నెలల్లో బంగాళాఖాతంలో తుఫానులు ఏర్పడే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. దీంతో వాతావరణ పరిస్థితులను అధికారులు నిశితంగా పరిశీలిస్తున్నారు.

ప్రాథమిక అంచనాల ప్రకారం శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు, తిరుపతి, చిత్తూరు, అన్నమయ్య జిల్లాలపై ఈ వాతావరణ వ్యవస్థ ప్రభావం ఉండే అవకాశం ఉంది. ఆయా ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉండటంతో పాటు సముద్రం అల్లకల్లోలంగా మారవచ్చని అంచనా వేస్తున్నారు. అయితే ఇవి ప్రస్తుతం వాతావరణ నమూనాలు సూచిస్తున్న ప్రాథమిక అంచనాలు మాత్రమే. నవంబర్ రెండో వారంలో అల్పపీడన వ్యవస్థ ఏర్పడిన తర్వాతే తుఫాను గమనం, తీవ్రత, తీరం దాటే ప్రాంతంపై మరింత స్పష్టత వచ్చే అవకాశం ఉంది. వాతావరణంలో చోటుచేసుకునే మార్పులను నిరంతరం గమనిస్తున్నామని, తాజా సమాచారాన్ని ఎప్పటికప్పుడు ప్రజలకు తెలియజేస్తామని విపత్తు నిర్వహణ అధికారులు వెల్లడించారు. ప్రభావిత ప్రాంతాల ప్రజలు అధికారిక వాతావరణ హెచ్చరికలను గమనిస్తూ అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు.


కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!