

పాకిస్థాన్ గూఢచార సంస్థ ఐఎస్‌ఐతో సంబంధం ఉన్నట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న గూఢచార నెట్‌వర్క్‌ను ఢిల్లీ పోలీసుల స్పెషల్ సెల్ ఛేదించినట్లు సమాచారం. దేశ రక్షణ వ్యవస్థకు సంబంధించిన సున్నితమైన సమాచారాన్ని పాక్ హ్యాండ్లర్లకు చేరవేశారనే ఆరోపణలతో ఢిల్లీకి చెందిన దంపతులు సాహిల్ (25), సమీరా (21)లను పోలీసులు అరెస్ట్ చేశారు. సరాయ్ కాలే ఖాన్‌లోని చాంద్ బీబీ క్యాంప్‌లో నివసించే ఈ దంపతులు 2024 నుంచి పాకిస్థాన్ కేంద్రంగా పనిచేస్తున్న హ్యాండ్లర్లతో సంప్రదింపులు జరుపుతున్నట్లు దర్యాప్తులో గుర్తించినట్లు అధికారులు తెలిపారు. ఇందుకు ప్రతిఫలంగా నగదు అందుకున్నారనే ఆరోపణలపైనా విచారణ కొనసాగుతోంది.
భారత మొబైల్ నంబర్లను పాకిస్థాన్‌లో వాట్సాప్ ఖాతాల యాక్టివేషన్‌కు ఉపయోగించేలా చేయడం, వాటి ద్వారా భారతీయ గ్రూపుల్లోకి ప్రవేశించి సమాచారాన్ని సేకరించడం వంటి కార్యకలాపాలకు సహకరించినట్లు సాహిల్‌పై ఆరోపణలు ఉన్నాయి. అలాగే సైనిక కంటోన్మెంట్ ప్రాంతాల్లో రెక్కీ నిర్వహించడం, కొత్త వ్యక్తులను నెట్‌వర్క్‌లోకి చేర్చడం, కోర్ట్ మార్షల్ విచారణ ఎదుర్కొంటున్న ఆర్మీ అధికారులకు సంబంధించిన వివరాలను సేకరించడం వంటి అంశాలపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. 2024లో ఇన్‌స్టాగ్రామ్ ద్వారా సాహిల్‌కు పాక్ ఏజెంట్లతో పరిచయం ఏర్పడినట్లు, ఈ వ్యవహారంలో సమీరా పాత్రపైనా విచారణ జరుగుతున్నట్లు సమాచారం. నిందితుల మొబైల్ ఫోన్లలో పాక్ ఏజెంట్లతో జరిగిన చాట్‌లు, ఇతర కీలక సమాచారం లభించినట్లు పోలీసులు తెలిపారు. సాహిల్ IGNOUలో డిగ్రీ పూర్తి చేసి గతంలో ఓ లాయర్ వద్ద పనిచేయగా, సమీరా నోయిడాలోని కాల్ సెంటర్‌లో పనిచేసినట్లు వెల్లడైంది. ఈ కేసులో మరిన్ని పాక్ లింకులను గుర్తించేందుకు స్పెషల్ సెల్ దర్యాప్తును ముమ్మరం చేసింది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!