

పాకిస్థాన్‌లో లష్కరే తోయిబా (ఎల్‌ఈటీ) సీనియర్ కమాండర్‌గా పేర్కొంటున్న ఖారీ సయీద్ అబ్దుల్ అజీజ్ అనుమానాస్పద పరిస్థితుల్లో మృతి చెందినట్లు నివేదికలు వెల్లడించాయి. ప్రార్థనల కోసం ఇస్లామాబాద్‌లోని ఖుబా మసీదుకు వెళ్లే ముందు అబ్దుల్ అజీజ్ ఓ రెస్టారెంట్‌లో భోజనం చేసినట్లు సమాచారం. అనంతరం మసీదు ప్రవేశద్వారం వద్ద అకస్మాత్తుగా కుప్పకూలిన ఆయన కొద్దిసేపటికే మృతి చెందినట్లు తెలుస్తోంది. అయితే ఆయన మరణానికి అసలు కారణం ఏమిటన్నది అధికారికంగా స్పష్టంకాలేదు. అనారోగ్యం, విషప్రయోగం లేదా ఇతర కారణాలేమైనా ఉన్నాయా అనేది నిర్ధారణ కావాల్సి ఉంది.
అబ్దుల్ అజీజ్ లష్కరే తోయిబాలో కీలక లాజిస్టికల్ బాధ్యతలు నిర్వహించినట్లు నివేదికలు పేర్కొంటున్నాయి. జమ్మూకశ్మీర్‌లోకి చొరబడే ఉగ్రవాదులకు ఆశ్రయం, ఆర్థిక సహాయం, నకిలీ పత్రాలు సమకూర్చడంలో ఆయన పాత్ర ఉన్నట్లు ఆరోపణలు ఉన్నాయి. ఎన్‌కౌంటర్లలో మరణించిన ఉగ్రవాదుల కుటుంబాలకు ఆర్థిక సహాయం అందించడంలోనూ ఆయన భాగస్వామ్యం ఉన్నట్లు సమాచారం. ఇదిలా ఉండగా, లష్కరే తోయిబాకు చెందిన మరో నేత రిజ్వాన్ హనీఫ్ ఇటీవల పాకిస్థాన్, పాక్ ఆక్రమిత కశ్మీర్‌లో గత మూడేళ్లలో 30 మందికిపైగా తమ సభ్యులు గుర్తుతెలియని వ్యక్తుల చేతిలో హతమైనట్లు ఆరోపించారు. ఈ ఘటనల వెనుక భారత నిఘా వర్గాలు ఉన్నాయన్న ఆయన ఆరోపణలను భారత్ ఖండించింది.

కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!