

గిరిజన స్వాతంత్ర్య సమరయోధుడు భగవాన్ బిర్సా ముండా 151వ జయంతిని పురస్కరించుకుని హైదరాబాద్లో జనజాతీయ గౌరవ దివస్ ర్యాలీ ఘనంగా నిర్వహించారు. బీజేపీ తెలంగాణ రాష్ట్ర ఎస్టీ మోర్చా ఆధ్వర్యంలో ట్యాంక్ బండ్పై నిర్వహించిన ఈ కార్యక్రమంలో కేంద్ర మంత్రి జి. కిషన్ రెడ్డి పాల్గొన్నారు. స్వామి వివేకానంద విగ్రహం వద్ద ప్రారంభమైన ర్యాలీ శ్రీ కొమురం భీమ్ విగ్రహం వరకు కొనసాగింది. ఈ సందర్భంగా బిర్సా ముండా చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. గిరిజన సమాజానికి, స్వాతంత్ర్య పోరాటానికి ఆయన చేసిన సేవలను స్మరించుకున్నారు.
ఈ సందర్భంగా కిషన్ రెడ్డి మాట్లాడుతూ.. గిరిజనుల ఆత్మగౌరవ పరిరక్షణ, అభివృద్ధికి ప్రధాని మోదీ ప్రభుత్వం కట్టుబడి ఉందని అన్నారు. నక్సలిజం నిర్మూలనతో గిరిజన ప్రాంతాల్లో అభివృద్ధికి మరిన్ని అవకాశాలు ఏర్పడతాయని పేర్కొన్నారు. గిరిజన మహిళలు, కుటుంబాల సంక్షేమం కోసం కేంద్ర ప్రభుత్వం అనేక కార్యక్రమాలను అమలు చేస్తోందని తెలిపారు. బిర్సా ముండా పోరాట స్ఫూర్తి, త్యాగాలను భావితరాలకు పరిచయం చేసేందుకు రాంచీలో స్మారక మ్యూజియం ఏర్పాటు చేయడం చారిత్రక నిర్ణయమని అభివర్ణించారు. అల్లూరి సీతారామరాజు వంటి గిరిజన స్వాతంత్ర్య సమరయోధుల త్యాగాలకు కూడా తగిన గుర్తింపు కల్పిస్తున్నామని చెప్పారు. గిరిజనుల గౌరవం, అభివృద్ధి, సంక్షేమమే లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం పనిచేస్తోందని ఆయన స్పష్టం చేశారు.














కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!