

ఆంధ్రప్రదేశ్‌లోని పెద్దగడ్డ రిజర్వాయర్ కుడి కాలువ ఆయకట్టులో ఎం-కాడ్వామ్ (మోడరైజేషన్ ఆఫ్ కమాండ్ ఏరియా అండ్ వాటర్ మేనేజ్‌మెంట్) పథకాన్ని పైలట్ ప్రాజెక్టుగా అమలు చేస్తున్నారు. కాలువల ద్వారా కాకుండా భూగర్భ పైపుల ద్వారా పొలాలకు సాగునీరు అందించే విధానాన్ని ఇందులో అమలు చేయనున్నారు. తొలిదశలో పార్వతీపురం మన్యం జిల్లాలో 1,843 హెక్టార్లు, విజయనగరం జిల్లాలో 1,218 హెక్టార్ల ఆయకట్టును ఈ ప్రాజెక్టు పరిధిలోకి తీసుకురానున్నారు. నీటి పొదుపుతో పాటు సన్న, చిన్నకారు రైతులకు ప్రయోజనం చేకూర్చే లక్ష్యంతో కేంద్రం ఈ పథకాన్ని ప్రవేశపెట్టింది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు 60:40 నిష్పత్తిలో నిధులు సమకూర్చనున్నాయి.
పెద్దగడ్డ ప్రాజెక్టులో తొలి దశ పనులకు రూ.56.10 కోట్ల అంచనా వ్యయంతో టెండర్లు పిలవగా, ఐదుసార్లు టెండర్ల అనంతరం ఒక ఏజెన్సీ 14.88 శాతం అధిక ధరకు బిడ్ దాఖలు చేసింది. దీంతో రూ.64.45 కోట్లతో పనులు అప్పగించేందుకు రాష్ట్ర మంత్రిమండలి ఆమోదం తెలిపింది. పొలాల్లో మట్టి తేమ, అవసరమైన నీటి పరిమాణాన్ని గుర్తించేందుకు స్కడా, ఐఓటీ సాంకేతికతను వినియోగించనున్నారు. ప్రాజెక్టు పూర్తయిన తర్వాత నిర్వహణ బాధ్యతలను రైతులకే అప్పగించనున్నారు. ఈ ఆర్థిక సంవత్సరానికి రూ.20 కోట్లు కేటాయించగా, సాంకేతిక సహకారాన్ని మహన వెంచర్స్ అందిస్తోంది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!